బంగ్లాదేశ్‌లో దాడులను ఖండించరేం?: విజయసాయిరెడ్డి

  • హిందువులపై హింసను నరమేధంగా అభివర్ణించిన విజయసాయి
  • దాడులను ఖండించని వారు భారతీయులేనా? అని ప్రశ్న
  • స్పందించని వారిని దేశం నుంచి బహిష్కరించాలని పిలుపు
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల పట్ల దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ హింసను 'నరమేధం'గా అభివర్ణించిన ఆయన, ఈ దాడులను ఖండించని వారు అసలు భారతీయులేనా? అంటూ సంచలన ప్రశ్నలు సంధించారు.

ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ, మతం పేరుతో సాగుతున్న ఈ హింస మానవత్వానికే మాయని మచ్చ అని ఆవేదన వ్యక్తం చేశారు. "బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అమానుష దాడులను ఖండించకుండా మౌనంగా ఉన్న రాజకీయ పార్టీలకు, నాయకులకు ఈ దేశంలో కొనసాగే నైతిక హక్కు ఉందా?" అని నిలదీశారు. భారతదేశం సహనానికి, మత సామరస్యానికి ప్రతీక అని, అలాంటి దేశంలో ఉంటూ ఈ దాడులపై స్పందించకపోవడం దేశభక్తికి విరుద్ధమని అభిప్రాయపడ్డారు.

ఇది కేవలం ఒక దేశ సమస్య కాదని, అంతర్జాతీయ మానవ హక్కుల ఉల్లంఘన అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. బాధితుల పక్షాన నిలబడకుండా మౌనం పాటించడం అనైతికమని, ప్రజాస్వామ్య విలువలకు భంగం కలిగించడమేనని అన్నారు. ఈ దాడులను ఖండించలేని వారిని మనమే దేశం నుంచి బహిష్కరిద్దామని ఆయన పిలుపునిచ్చారు.

బంగ్లాదేశ్ హింసాకాండపై భారత ప్రభుత్వం స్పష్టమైన వైఖరి తీసుకోవాలని, బాధితులకు అండగా నిలవాలని ఆయన డిమాండ్ చేశారు.  


More Telugu News