కాలుష్యం ఎఫెక్ట్.. ఢిల్లీ స్కూళ్లలో ఎయిర్ ఫ్యూరిఫైయర్లు

  • కాలుష్యాన్ని నిర్మూలించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్న విద్యాశాఖ మంత్రి 
  • 38 వేల క్లాస్ రూంలలో దశల వారీగా ఏర్పాటు
  • తొలిదశలో 10 వేల స్కూళ్లలో ఏర్పాటుకు టెండర్లు పిలిచిన ప్రభుత్వం
ఢిల్లీలో కాలుష్యం రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) పడిపోతుండటంతో జనం అనారోగ్యాలపాలవుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వాయు కాలుష్యం కారణంగా స్కూళ్లకు సెలవులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల ఆరోగ్యం కాపాడేందుకు తరగతి గదుల్లో ఎయిర్ ఫ్యూరిఫైయర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మొత్తంగా ఢిల్లీలోని 38 వేల స్కూళ్లలో ఎయిర్ ఫ్యూరిఫైయర్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

ఈ మేరకు ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఆశిష్ సూద్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో వాయు కాలుష్య సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కాలుష్యాన్ని నిర్మూలించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, వాటి ఫలితాలు త్వరలోనే క్షేత్రస్థాయిలో కనిపిస్తాయని ఆయన పేర్కొన్నారు. పర్యావరణ సెస్ నిధులను ఉపయోగించి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌‌మెంట్ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మెకానికల్ రోడ్ స్వీపర్‌‌ ను కూడా కొనుగోలు చేస్తుందని తెలిపారు.

ఢిల్లీలోని 38 వేల తరగతి గదుల్లో దశలవారీగా ఎయిర్ ప్యూరిఫైయర్‌‌లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. మొదటి దశలో భాగంగా 10 వేల తరగతి గదులలో ఎయిర్ ప్యూరిఫైయర్లను ఏర్పాటు చేసేందుకు టెండర్లు పిలిచినట్లు ఆయన తెలిపారు.


More Telugu News