Ganesan: బీమా సొమ్ము కోసం తండ్రినే హత్య చేసిన తనయులు..బయటపడింది ఇలా..!

Ganesan Sons Murder Father For Insurance Money in Tamil Nadu
  • పాముకాటుగా చిత్రీకరించేందుకు కిరాతక ప్లాన్
  • అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన బీమా సంస్థ
  • ఇద్దరు కుమారులు సహా మొత్తం 8 మంది అరెస్ట్
తమిళనాడులో ఓ దారుణ ఘటన వెలుగుచూసింది. కన్న తండ్రిని అత్యంత కిరాతకంగా హత్య చేయించి, అది ప్రమాదవశాత్తు పాము కాటుతో జరిగినట్టుగా చిత్రీకరించారు ఇద్దరు కుమారులు. రూ.3 కోట్ల బీమా సొమ్ము కోసమే వారు ఈ దారుణానికి ఒడిగట్టారని తెలుస్తోంది. బీమా క్లెయిమ్ ప్రక్రియలో అధికారులకు వచ్చిన అనుమానంతో ఈ హత్య వెనుక ఉన్న కుట్ర బయటపడింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరువళ్లూరు జిల్లాకు చెందిన గణేశన్ (56) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. అక్టోబర్‌లో ఆయన పాము కాటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. అంత్యక్రియలు పూర్తయ్యాక, గణేశన్ పేరు మీద ఉన్న రూ.3 కోట్ల బీమా కోసం ఆయన ఇద్దరు కుమారులు బీమా సంస్థను సంప్రదించారు.

అయితే, గణేశన్ పేరు మీద అధిక మొత్తంలో పలు బీమా పాలసీలు ఉండటం, క్లెయిమ్ కోసం వచ్చిన కుమారుల ప్రవర్తనపై అనుమానం రావడంతో బీమా సంస్థ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసును లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. బీమా డబ్బు కోసమే కొడుకులు పథకం ప్రకారం తండ్రిని హత్య చేయించారని తేలింది.

విచారణలో, హత్యకు వారం రోజుల ముందు కూడా ఓసారి ప్రయత్నించి విఫలమయ్యారని నిందితులు అంగీకరించారు. ఆ తర్వాత అత్యంత విషపూరితమైన పామును తీసుకొచ్చి, నిద్రిస్తున్న తండ్రి మెడపై కాటు వేయించారు. అది ప్రమాదమని నమ్మించేందుకు పామును అక్కడే చంపేశారు. అంతేకాకుండా, ఉద్దేశపూర్వకంగానే ఆసుపత్రికి తరలించడంలో ఆలస్యం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇద్దరు కుమారులతో పాటు వారికి సహకరించిన మరో ఆరుగురిని అరెస్టు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 
Ganesan
Tamil Nadu
insurance fraud
father murder
crime news
insurance money
police investigation
Thiruvallur district
snake bite death
murder for insurance

More Telugu News