Train accident: రైలులో నుంచి పడి కొత్త జంట దుర్మరణం.. వంగపల్లి సమీపంలో ఘటన

Train accident near Vangapalli kills newly married couple
  • రెండు నెలల కిందటే వివాహం
  • బంధువుల ఇంటికి వెళ్లేందుకు రైలెక్కిన నవ దంపతులు
  • ప్రమాదవశాత్తూ జారిపడ్డారని భావిస్తున్న రైల్వే పోలీసులు
రెండు నెలల క్రితమే వారికి వివాహం జరిగింది. కొత్త కాపురం సంతోషంగా సాగుతున్న వేళ అనుకోని ప్రమాదం వారిని మృత్యుఒడిలోకి చేర్చింది. బంధువుల ఇంటికి వెళ్లేందుకు రైలు ఎక్కిన ఆ భార్యాభర్తలు ప్రమాదవశాత్తూ కిందపడి ప్రాణాలు కోల్పోయారు. గురువారం అర్ధరాత్రి వంగపల్లి స్టేషన్ సమీపంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. 

రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లోని పార్వతీపురం మన్యం జిల్లా రావుపల్లికి చెందిన కోరాడ సింహాచలం (25) హైదరాబాద్ లోని ఓ కెమికల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. రెండు నెలల క్రితం మన్యం జిల్లాలోని అంకవరం గ్రామానికి చెందిన భవాని (19)తో సింహాచలం వివాహం జరిగింది. నవ దంపతులు జగద్గిరిగుట్టలోని గాంధీనగర్‌లో నివాసం ఉంటున్నారు. 

ఈ క్రమంలో విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లడానికి సింహాచలం, భవాని గురువారం రాత్రి సికింద్రాబాద్ లో మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ ఎక్కారు. రైలు రద్దీగా ఉండటంతో వారు డోర్ దగ్గర నిలబడ్డారు. రైలు వంగపల్లి రైల్వేస్టేషన్‌ దాటిన తర్వాత ప్రమాదవశాత్తూ ఇద్దరూ జారిపడి మృతి చెందారు. శుక్రవారం ఉదయం ట్రాక్‌మెన్‌ మృతదేహాలను గమనించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
Train accident
Andhra Pradesh
Machilipatnam Express
New couple death
Railway accident
Parvathipuram Manyam district
Bhavani
Secunderabad
Korada Simhachalam
Vangapalli

More Telugu News