Sharif Usman Hadi: రగిలిన ఢాకా: 27 ఏళ్లలో తొలిసారి ఆగిపోయిన పత్రికా ప్రచురణ

Sharif Usman Hadi Murder Sparks Dhaka Violence Newspaper Shut Down
  • ఉస్మాన్ హది హత్యతో బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు
  • ఆగ్రహంతో రగిలిపోయిన నిరసనకారులు
  • ఢాకాలోని రెండు అగ్రశ్రేణి పత్రికా కార్యాలయాలు దగ్ధం
  • ఇది పత్రికా స్వేచ్ఛపై జరిగిన క్రూరమైన దాడిగా, చరిత్రలోనే 'చీకటి రాత్రి'గా 'ప్రొథొమ్ ఆలో' ఎడిటర్ అభివర్ణన 
బంగ్లాదేశ్‌లో ఓ యువ నాయకుడి హత్యకు ప్రతీకారంగా వందలాది మంది ఆందోళనకారులు సృష్టించిన విధ్వంసం దేశ రాజధాని ఢాకాను వణికించింది. దేశంలోని రెండు ప్రతిష్ఠాత్మక దినపత్రికలైన ‘ప్రొథొమ్ ఆలో’, ‘ది డైలీ స్టార్’ కార్యాలయాలపై పెట్రోల్ బాంబులతో దాడి చేసి, నిలువునా దహనం చేశారు. ఈ భయానక పరిస్థితుల కారణంగా 27 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో తొలిసారిగా ‘ప్రొథొమ్ ఆలో’ పత్రిక ప్రచురణను నిలిపివేసింది.

అసలేం జరిగింది?
స్థానిక యువజన నాయకుడు, 32 ఏళ్ల షరీఫ్ ఉస్మాన్ హది తన ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతుండగా డిసెంబర్ 6న గుర్తుతెలియని దుండగులు ఆయన తలపై కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలపాలైన ఆయనను మెరుగైన చికిత్స కోసం సింగపూర్‌లోని ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ 12న మృతి చెందారు. ఈ వార్త తెలియగానే ఆయన మద్దతుదారులు ఆగ్రహంతో రగిలిపోయారు. వందలాది మంది ఒక్కసారిగా ఢాకా వీధుల్లోకి వచ్చి, తమ నాయకుడి హత్యకు మీడియానే కారణమంటూ ప్రచారం చేస్తూ విధ్వంసానికి తెగబడ్డారు.

ప్రాణభయంతో జర్నలిస్టుల పరుగులు
ఈ దాడిపై ‘ప్రొథొమ్ ఆలో’ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సజ్జద్ షరీఫ్ తీవ్ర ఆవేదనతో స్పందించారు. “మా జర్నలిస్టులు ప్రాణభయంతో వణికిపోయారు. ఆఫీసులో పనిచేస్తున్న వారిపై రాళ్లు, పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. కిటికీలు బద్దలుకొట్టి, లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఇది మా 27 ఏళ్ల చరిత్రలోనే అత్యంత చీకటి రాత్రి. భద్రత లేని కారణంగా, చరిత్రలో తొలిసారిగా మేము పత్రికను ప్రచురించలేకపోయాం. ఆన్‌లైన్ ఎడిషన్‌ను కూడా నిలిపివేశాం. ఇది కేవలం మా ఆఫీసుపై దాడి కాదు, బంగ్లాదేశ్ పత్రికా స్వేచ్ఛను హరించే ప్రయత్నం. ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఈ అరాచకానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి” అని ఆయన డిమాండ్ చేశారు.

జాతీయ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చోటుచేసుకున్న ఈ హత్య, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలు బంగ్లాదేశ్ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దేశంలో నెలకొన్న రాజకీయ అస్థిరతకు, క్షీణిస్తున్న శాంతిభద్రతలకు ఈ దాడులు అద్దం పడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Sharif Usman Hadi
Bangladesh
Dhaka
Prothom Alo
Daily Star
Journalist attack
Political violence
Newspaper arson
Bangladesh election
Press freedom

More Telugu News