తెలంగాణలో సహకార సంఘాల పాలకవర్గాలు రద్దు..
- టెస్కాబ్, డీసీసీబీలకు ఇన్‌చార్జిలుగా ప్రభుత్వ అధికారులు
- పాత కమిటీల కొనసాగింపు ఉత్తర్వులను రద్దు చేసిన సర్కార్
- కొత్త జిల్లాలు, మండలాల వారీగా పునర్వ్యవస్థీకరణకు కసరత్తు
వివరాల్లోకి వెళితే, రాష్ట్రంలోని 9 డీసీసీబీలు, 904 పీఏసీఎస్‌లు, టెస్కాబ్ పాలక మండళ్ల పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ముగిసింది. దీంతో అప్పటి పాలకవర్గాలనే ‘పర్సన్ ఇన్ఛార్జి మేనేజింగ్ కమిటీలు’గా కొనసాగిస్తూ ఫిబ్రవరి 14న ప్రభుత్వం ఆరు నెలల పాటు గడువు పొడిగించింది. ఆ తర్వాత ఆగస్టు 14న ఆ గడువును నిరవధికంగా పొడిగిస్తూ మరో జీవో జారీ చేసింది.
తాజాగా, ఆ జీవోను రద్దు చేస్తూ ఈ సంస్థలన్నింటికీ అధికారులను ఇన్ఛార్జిలుగా నియమించారు. కొత్త జిల్లాలకు అనుగుణంగా డీసీసీబీలను, కొత్త మండలాల ప్రకారం పీఏసీఎస్‌లను పునర్వ్యవస్థీకరించేందుకు ప్రభుత్వం కొంత కాలంగా కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియను వేగవంతం చేయడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పునర్వ్యవస్థీకరణ పూర్తయ్యాకే కొత్త పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.