Venkaiah Naidu: అదీ బీజేపీ గొప్పదనం: వెంకయ్యనాయుడు

Venkaiah Naidu Praises BJP at Atal Modi Event
  • జెండాలు కట్టే స్థాయి నుంచి పార్టీ అధ్యక్షుడిగా ఎదిగానన్న వెంకయ్యనాయుడు
  • ఉప రాష్ట్రపతి పదవితో బీజేపీకి దూరం కావాల్సి వచ్చిందని కన్నీళ్లు పెట్టుకున్నానని వెల్లడి
  • వాజ్‌పేయ్ విలువలను బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు ఆచరించాలని సూచన
  • పదవీ విరమణ చేశా కానీ, పెదవీ విరమణ చేయలేదంటూ వ్యాఖ్య
చిన్నతనంలోనే తల్లిని కోల్పోతే, భారతీయ జనతా పార్టీయే తనను తల్లిలా ఆదరించి, పెంచి పెద్ద చేసిందని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. విజయనగరంలో జరిగిన అటల్ మోదీ సుపరిపాలన యాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, తన రాజకీయ జీవితం గురించి, పార్టీ గొప్పతనాన్ని వివరించారు.

16వ ఏటనే రాజకీయాల్లోకి వచ్చి జెండాలు కట్టే స్థాయి నుంచి అదే పార్టీకి అధ్యక్షుడిగా ఎదిగానని, వాజ్‌పేయ్, అద్వానీల మధ్య కూర్చునే గౌరవం దక్కిందని ఆయన పేర్కొన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసేవారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని తన జీవితమే ఉదాహరణ అని చెబుతూ, అదే బీజేపీ గొప్పతనమని అన్నారు.

తన రాజకీయ జీవితంలోని ఓ ఉద్వేగభరిత ఘట్టాన్ని ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు గుర్తు చేసుకున్నారు. తనను ఉపరాష్ట్రపతిగా ప్రకటించినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నానని అన్నారు. అయితే, అది మంత్రి పదవి పోతోందన్న బాధతో కాదని, తల్లిలాంటి భారతీయ జనతా పార్టీని వీడాల్సి వస్తోందన్న ఆవేదనతోనే కంటతడి పెట్టానని ఆయన స్పష్టం చేశారు.

సుపరిపాలన అంటే అట్టడుగు వర్గాలకు అవకాశం కల్పించడం, మహిళలపై అఘాయిత్యాలు లేని సమాజాన్ని నిర్మించడం అని వెంకయ్య నాయుడు నిర్వచించారు. అవినీతికి తావులేకుండా, 32 పార్టీలను ఏకతాటిపై నడిపి సుపరిపాలనకు వాజ్‌పేయ్ శ్రీకారం చుట్టారని కొనియాడారు. రాజకీయాల్లో పదవుల కోసం పోటీ పడొచ్చు కానీ, ఎలాంటి మచ్చ లేకుండా పనిచేయడం ముఖ్యమని, అలాంటి వారిలో అశోక్ గజపతిరాజు ఒకరని ప్రశంసించారు.

వాజ్‌పేయ్ విగ్రహాలు పెట్టి దండలు వేయడం కాదని, ఆయన చూపిన విలువలను బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు ఆచరించాలని సూచించారు. తాను రాజకీయ పదవి నుంచి విరమణ చేశానే తప్ప, పెదవికి విరమణ చేయలేదని, అందుకే మాట్లాడుతూనే ఉంటానని తనదైన శైలిలో చమత్కరించారు. 
Venkaiah Naidu
BJP
Atal Modi Suparipalana Yatra
Vajpayee
Advani
Indian Politics
Vizianagaram
Ashok Gajapathi Raju
Telugu News
Political Speech

More Telugu News