సినీ దిగ్గజాల సమక్షంలో ఘనంగా 'సోగ్గాడు' స్వర్ణోత్సవ కార్యక్రమం

  • 'సోగ్గాడు' చిత్రానికి 50 ఏళ్లు.. ఘనంగా స్వర్ణోత్సవ వేడుక
  • సురేష్ ప్రొడక్షన్స్, శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో కార్యక్రమం
  • హాజరైన జయసుధ, జయచిత్ర, రాధిక సహా పలువురు సినీ ప్రముఖులు
  • శోభన్ బాబుతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్న తారలు
  • ఆయన క్రమశిక్షణ, గొప్ప వ్యక్తిత్వాన్ని కొనియాడిన వక్తలు
నటభూషణ్ శోభన్ బాబు కథానాయకుడిగా నటించిన క్లాసిక్ చిత్రం "సోగ్గాడు" విడుదలై 50 ఏళ్లు పూర్తయింది. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని సురేష్ ప్రొడక్షన్స్, అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి సంయుక్తంగా శుక్రవారం హైదరాబాద్‌లోని కొమరం భీమ్ ఆదివాసీ భవన్‌లో స్వర్ణోత్సవ వేడుకను అట్టహాసంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి పలువురు సినీ దిగ్గజాలు హాజరై శోభన్ బాబుతో తమ జ్ఞాపకాలను, ఆయన గొప్పతనాన్ని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడారు.

ఆ గర్వం ఇప్పటికీ గుర్తుంది: జయచిత్ర
50 ఏళ్ల తర్వాత ఒక సినిమాకు ఈవెంట్ జరుపుకోవడం బహుశా ‘సోగ్గాడు’ చిత్రానికే దక్కిందని నేను భావిస్తున్నా. శోభన్ బాబు గారి లాంటి పెద్ద హీరోతో నటించే అవకాశం రామానాయుడు గారు కల్పించారు. తాష్కెంట్ ఫిలిం ఫెస్టివల్‌లో ఈ సినిమా ప్రదర్శితమైనప్పుడు కలిగిన గర్వం ఇంకా నా మనసులో అలాగే ఉంది.

ఆయన నుంచి క్రమశిక్షణ నేర్చుకున్నా: జయసుధ
శోభన్ బాబు గారి నుంచి క్రమశిక్షణ, సమయపాలన నేర్చుకున్నాను. ఆయనంటే మా హీరోయిన్స్ అందరికీ ఎంతో ఇష్టం. మేమిద్దరం 38 సినిమాల్లో కలిసి నటించాం. ఆయనతో, రామానాయుడు గారితో నా జర్నీ గురించి ఒక పుస్తకమే రాయొచ్చు.

హీరోయిన్లకు ఎంతో గౌరవం ఇచ్చేవారు: సుమలత
శోభన్ బాబు గారు హీరోయిన్లను ఎంతో గౌరవించేవారు. నేను చాలా జూనియర్‌ని అయినా ‘సుమలత గారు’ అని పిలిచేవారు. కెరీర్, పర్సనల్ లైఫ్‌ను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో ఆయన సూచించేవారు.

ఆయన అందమైన వ్యక్తిత్వం కలవారు: రాధిక శరత్ కుమార్
ఆయన అందగాడే కాదు, అందమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. తన సినిమా సెట్‌లో వేరే సినిమా గురించి మాట్లాడటం నేను చూడలేదు. ఆయన క్రమశిక్షణ మా అందరికీ ఆదర్శం. నేను చేసిన ‘పిన్ని’ సీరియల్ బాగుందని ఫోన్ చేసి అభినందించారు.

ఆయనను ఎప్పటికీ మర్చిపోలేను: ప్రభ
మీ అందరిలాగే నేనూ శోభన్ బాబు గారి అభిమానినే. నా జీవితంలో శోభన్ బాబు గారిని, రామానాయుడు గారిని ఎప్పుడూ మర్చిపోలేను. ఆయనతో కొన్ని సినిమాలను కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను.

నన్ను సొంత చెల్లిలా చూసుకున్నారు: రోజా రమణి
నేను శోభన్ బాబు గారికి చెల్లిగా 9 సినిమాల్లో నటించాను. ఆయన నన్ను ‘సిస్టరీ’ అని ఆప్యాయంగా పిలిచేవారు. తన సొంత చెల్లిలా నన్ను చూసుకున్నారు. ఆయన మన మధ్య లేకపోవడం బాధగా ఉంది.

మహిళా అభిమానులకు ఆరాధ్య దైవం: పరుచూరి గోపాలకృష్ణ
"సోగ్గాడు" తర్వాత శోభన్ బాబు గారు అగ్రస్థానానికి చేరారు. ఆయనకు మహిళా అభిమానులు ఎక్కువ. ‘మానవుడు దానవుడు’ లాంటి చిత్రాల్లో ఆయన నటన అద్భుతం. ఆయన మన మధ్య లేకపోయినా, సేవా సమితి ఇలాంటి కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉంది.

నిర్మాతకు అండగా నిలిచే హీరో: కేఎస్ రామారావు
శోభన్ బాబు గారు ఎంతో క్రమశిక్షణ కలిగిన హీరో. నిర్మాత బడ్జెట్‌లో సినిమా పూర్తి చేసేలా సహకరించేవారు. అలాంటి గొప్ప హీరో మన మధ్య లేకపోవడం బాధాకరం.

ఆ పాటలు నా మదిలో ఉన్నాయి: పి. సుశీల
"సోగ్గాడు" సినిమాతో నాకు మంచి పేరు వచ్చింది. శోభన్ బాబు గారి సినిమాల్లో నేను పాడిన ప్రతి పాట నా మదిలో మెదులుతూనే ఉంటుంది. ఈ కార్యక్రమం పాత జ్ఞాపకాలను గుర్తు చేసింది.

 ప్రేక్షకులకు షడ్రుచోపేతమైన భోజనం: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
శోభన్ బాబు గారితో నాకు మంచి అనుబంధం ఉంది. ఈ సినిమా ప్రేక్షకులకు షడ్రుచోపేతమైన భోజనంలాంటి వినోదాన్ని అందించింది. హీరో కోసం ఒకసారి, హీరోయిన్ల కోసం మరోసారి ఈ సినిమా చూశాను.

మా సంస్థకు కమ్ బ్యాక్ ఇచ్చిన సినిమా: సురేష్ బాబు
మా సురేష్ ప్రొడక్షన్స్ సంస్థకు "సోగ్గాడు" ఒక మైలురాయి. ఈ సినిమా మా సంస్థకు గొప్ప కమ్ బ్యాక్ ఇచ్చింది. శోభన్ బాబు గారి కోసమే ఈ కథ రాశారా అనిపిస్తుంది. ఆయన అభిమానులు పట్టుదలతో ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉంది.

లెజెండ్స్ మన హృదయాల్లో ఉంటారు: డా. సురక్షిత్
50 ఏళ్ల తర్వాత కూడా మా తాతగారి సినిమాను సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే ఇది ఎంత గొప్ప చిత్రమో అర్థమవుతోంది. లెజెండ్స్ ఎప్పుడూ మన హృదయాల్లో ఉంటారని ఈ కార్యక్రమం నిరూపించింది. ఆయన అభిమానులకు, కుటుంబానికి ఎంతో సమయం కేటాయించేవారు.

ఇండస్ట్రీకి ఆర్థికమంత్రి లాంటి వాడు శోభన్ బాబు: అట్లూరి పూర్ణచంద్రరావు
సోగ్గాడు టైటిల్ 20 లక్షల ఖరీదు చేస్తుందని అప్పట్లోనే రామానాయుడు గారిని అభినందించాను. శోభన్ బాబు గారు మన ఇండస్ట్రీలో ఆర్థికమంత్రిలా ఉండేవారు. ప్రతిదీ లెక్క వేసుకుని చేసేవారు.

ఈ కార్యక్రమంలో శోభన్ బాబు మరో మనవడు సౌరభ్ కూడా పాల్గొన్నారు. వేడుకకు హాజరైన అతిథులందరినీ నిర్వాహకులు శాలువాతో సత్కరించారు.


More Telugu News