ఎవరికీ చెప్పకుండా ఉండాల్సింది: లైంగిక వేధింపుల కేసులో మలయాళ బాధిత నటి వ్యాఖ్య

  • 2017 కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో ఆరుగురిని దోషులుగా తేల్చిన కోర్టు
  • నటుడు దిలీప్‌ను నిర్దోషిగా తేల్చిన కోర్టు
  • తనపై సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేశారని నటి ఫిర్యాదు
  • ఇలాంటి పరిస్థితి ఎవరికీ రావొద్దన్న నటి
2017 కిడ్నాప్ మరియు లైంగిక వేధింపుల కేసులో దోషుల్లో ఒకరు విడుదల చేసిన వీడియో చూసి దిగ్భ్రాంతికి గురయ్యానని బాధిత మలయాళ నటి వెల్లడించారు. అయితే, ఈ కేసులో తాను చట్టపరమైన పోరాటం చేసినందుకు విచారం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. న్యాయపోరాటం చేయకుండా ఉంటే బాగుండేదేమోనని వ్యాఖ్యానించారు. ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన కేసులో ఎర్నాకుళం సెషన్స్ కోర్టు కొద్ది రోజుల క్రితం ఆరుగురికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇదే కేసులో నటుడు దిలీప్‌ని న్యాయస్థానం నిర్దోషిగా తేల్చింది. ఈ కేసులో తీర్పు వెలువడిన అనంతరం ఆమె రెండోసారి స్పందించారు.

తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేశారని, తీర్పు వెలువడిన కొద్దిరోజులకు బాధిత నటి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఆ వీడియోను ప్రచారం చేసిన 21 సోషల్ మీడియా ఖాతాలను పోలీసులు గుర్తించారు. ఈ పరిణామాలపై బాధిత నటి స్పందించారు.

ఆ ఘటన గురించి తాను ఎవరికీ చెప్పకుండా ఉండాల్సిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒక నిందితుడు తీసిన వీడియో సోషల్ మీడియాలో కనిపించిందని ఆమె పేర్కొన్నారు. ఈ పరిస్థితి మీకు, మీ కుటుంబ సభ్యులకు రాకూడదని, తనను సాధారణ జీవితం గడపనీయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. "బాధితురాలిగా కాదు, ప్రాణాలతో బయటపడిన వ్యక్తిగా కూడా కాదు, ఒక సాధారణ మహిళగా నన్ను బతకనీయండి" అని ఆమె కోరారు.


More Telugu News