Chandrababu Naidu: హర్దీప్ పూరీతో సీఎం చంద్రబాబు భేటీ... నెల్లూరు బీపీసీఎల్ ప్రాజెక్టు శంకుస్థాపనకు ఆహ్వానం

Chandrababu Naidu Meets Hardeep Puri Invites to Nellore BPCL Project Launch
  • కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ పూరీతో సీఎం చంద్రబాబు భేటీ
  • నెల్లూరు బీపీసీఎల్ రిఫైనరీ శంకుస్థాపనకు ఆహ్వానం
  • రూ. 96,862 కోట్ల భారీ పెట్టుబడితో ప్రాజెక్ట్ ఏర్పాటు
  • ఇప్పటికే 6,000 ఎకరాలు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం
  • ప్రాజెక్ట్‌తో భారీగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని వెల్లడి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీతో ఈ సాయంత్రం భేటీ అయ్యారు. నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేయనున్న బీపీసీఎల్ గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కేంద్ర మంత్రిని ఆయన సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ప్రాజెక్ట్ పురోగతిని, దాని ప్రాధాన్యతను ముఖ్యమంత్రి వివరించారు. సుమారు రూ. 96,862 కోట్ల భారీ పెట్టుబడితో రానున్న ఈ ప్రాజెక్ట్, దేశంలోనే అతిపెద్ద సమీకృత ఇంధన ప్రాజెక్టులలో ఒకటిగా నిలవనుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 6,000 ఎకరాల భూమిని కేటాయించడంతో పాటు, పరిశ్రమకు ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను కూడా అందించిందని చంద్రబాబు పేర్కొన్నారు.

ప్రాజెక్టుకు సంబంధించిన పబ్లిక్ హియరింగ్ విజయవంతంగా పూర్తయిందని, పర్యావరణ అనుమతులు కూడా త్వరలోనే రానున్నాయని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రాజెక్ట్ పనులు అన్ని దశల్లో వేగంగా ముందుకు సాగుతున్నాయని వివరించారు. ఈ రిఫైనరీ ఏర్పాటుతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు లభించడంతో పాటు, పారిశ్రామికాభివృద్ధికి, ఆర్థిక వృద్ధికి గణనీయమైన ఊతం లభిస్తుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
Chandrababu Naidu
AP CM
Hardeep Singh Puri
BPCL
Nellore Refinery
Andhra Pradesh
Greenfield Refinery Project
Petroleum Ministry
Investment
Industrial Development

More Telugu News