Nara Lokesh: ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసు: నారా లోకేశ్

Nara Lokesh I know when to set the Muhurtam for whom
  • చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టబోమని లోకేశ్ హెచ్చరిక
  • టీడీపీలో 'అలక' అనే జబ్బు ఉందని వ్యాఖ్య
  • గత ప్రభుత్వంలో తమ నేతలను తీవ్రంగా వేధించారని ఆరోపణ
  • కార్యకర్తల త్యాగాల వల్లే 164 సీట్లు వచ్చాయని స్పష్టీకరణ
చట్టాన్ని ఉల్లంఘించి గతంలో అక్రమాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో తనకు బాగా తెలుసని ఏపీ మంత్రి నారా లోకేశ్ హెచ్చరించారు. ఈరోజు రాజమండ్రిలో జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. టీడీపీని భూస్థాపితం చేస్తామన్న వారి కలలు నెరవేరలేదని, ఎన్టీఆర్ స్థాపించిన ఈ పార్టీ మరో వందేళ్లు బలంగా నిలబడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

టీడీపీలో 'అలక' అనే ఒక జబ్బు ఉందని, దానిని వీడాలని కార్యకర్తలకు సూచించారు. "ఎమ్మెల్యేపై అలగడం కంటే, ఆయనతో పోరాడాలి. నాలుగు గోడల మధ్య తప్పులను సరిదిద్దాలి" అని హితవు పలికారు. మంగళగిరి, రాజమండ్రి నియోజకవర్గాలు టీడీపీకి కంచుకోటలని, ఇక్కడ పార్టీని ఓడించడం ఎవరి తరమూ కాదని ఆయన స్పష్టం చేశారు.

గత వైసీపీ ప్రభుత్వంలో ఆదిరెడ్డి వాసు, ఆయన తండ్రి ఆదిరెడ్డి అప్పారావును అన్యాయంగా జైల్లో పెట్టి వేధించారని లోకేశ్ ఆరోపించారు. అసెంబ్లీ సాక్షిగా అప్పటి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీని, నా తల్లిని కూడా అవమానించారు, ఆ విషయాలన్నీ నేను గుర్తుంచుకున్నాను అని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబును 53 రోజుల పాటు అక్రమంగా జైలులో నిర్బంధించినప్పుడు రాజమండ్రి కార్యకర్తలు తమ కుటుంబానికి అండగా నిలిచారని కృతజ్ఞతలు తెలిపారు. కార్యకర్తల త్యాగాల వల్లే కూటమి 164 స్థానాల్లో చారిత్రక విజయం సాధించిందని కొనియాడారు.

ఈ కార్యక్రమం అనంతరం పార్టీ కోసం కష్టపడిన కీలక కార్యకర్తలను లోకేశ్ సత్కరించి, వారి నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. 
Nara Lokesh
Andhra Pradesh
TDP
Rajamundry
Adi Reddy Vasu
Chandrababu Naidu
YCP Government
politics
AP Minister
TDP Cadre

More Telugu News