Donald Trump: గ్రీన్ కార్డ్ లాటరీని నిలిపివేసిన ట్రంప్.. కాల్పుల ఘటనతో సంచలన నిర్ణయం

Donald Trump Suspends Green Card Lottery
  • వలస విధానంపై ట్రంప్ మరో కఠిన వైఖరి 
  • అమెరికాలో గ్రీన్ కార్డ్ లాటరీ కార్యక్రమాన్ని నిలిపివేసిన ట్రంప్
  • చాలా కాలంగా గ్రీన్ కార్డ్ లాటరీని వ్యతిరేకిస్తున్న ట్రంప్
వలస విధానంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. బ్రౌన్, ఎంఐటీ యూనివర్సిటీల్లో కాల్పులకు పాల్పడిన నిందితుడు లాటరీ వీసా ద్వారానే దేశంలోకి ప్రవేశించాడని తేలడంతో, గ్రీన్ కార్డ్ లాటరీ కార్యక్రమాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

ట్రంప్ ఆదేశాల మేరకు యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్‌ (USCIS) ఈ కార్యక్రమాన్ని నిలిపివేయాలని ఆదేశించినట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోమ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో తెలిపారు. "ఇంతటి ఘోరానికి పాల్పడిన వ్యక్తిని మన దేశంలోకి అసలు అనుమతించాల్సింది కాదు" అని ఆమె పేర్కొన్నారు.

పోర్చుగల్ జాతీయుడైన క్లాడియో నెవెస్ వాలెంటె (48), బ్రౌన్ యూనివర్సిటీలో కాల్పులు జరిపి ఇద్దరు విద్యార్థులను చంపి, మరో తొమ్మిది మందిని గాయపరిచాడు. అలాగే ఎంఐటీలో ఒక ప్రొఫెసర్‌ను కూడా హత్య చేశాడు. ఆ తర్వాత గురువారం సాయంత్రం తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. నిందితుడు 2017లో డైవర్సిటీ వీసా లాటరీ ద్వారానే చట్టబద్ధమైన శాశ్వత నివాస హోదా పొందాడని యూఎస్ అటార్నీ లియా ఫోలీ తెలిపారు.

అమెరికాలో తక్కువ ప్రాతినిధ్యం ఉన్న దేశాల వారికి ప్రతి ఏటా లాటరీ పద్ధతిలో 50,000 గ్రీన్ కార్డులు జారీ చేసేందుకు కాంగ్రెస్ ఈ డైవర్సిటీ వీసా ప్రోగ్రామ్‌ను రూపొందించింది. ట్రంప్ చాలాకాలంగా ఈ లాటరీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. తాజా ఘటనను కారణంగా చూపి తన వలస విధాన లక్ష్యాలను ముందుకు తీసుకెళుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నిర్ణయంపై న్యాయపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది.
Donald Trump
Green Card Lottery
USCIS
Immigration Policy
Diversity Visa
Claudio Neves Valente
Brown University Shooting
MIT
United States Citizenship and Immigration Services
Visa Lottery

More Telugu News