Pawan Kalyan: గోదావరి వాటర్ గ్రిడ్ పనులకు రేపు శంకుస్థాపన చేయనున్న పవన్ కల్యాణ్

Pawan Kalyan Kicks Off Godavari Water Grid Project Addressing Water Scarcity
  • ఉభయ గోదావరి జిల్లాల కోసం వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు
  • రూ.3,050 కోట్ల వ్యయంతో 67 లక్షల మందికి లబ్ధి
  • రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రభుత్వ లక్ష్యం
ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. సుమారు రూ.3,050 కోట్ల భారీ వ్యయంతో చేపట్టనున్న గోదావరి వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. పెరవలి వద్ద జాతీయ రహదారి 216ఏ సమీపంలో ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఐదు జిల్లాల్లోని 67.82 లక్షల మందికి సురక్షితమైన, శుద్ధి చేసిన తాగునీటిని అందించనున్నారు.

ఈ బృహత్తర పథకంలో భాగంగా ధవళేశ్వరం, బొబ్బర్లంక, వేమగిరి వద్ద గోదావరి జలాలను సేకరించి, అత్యాధునిక సాంకేతికతతో శుద్ధి చేస్తారు. మొత్తం రెండు దశల్లో ఈ పనులు చేపట్టనున్నారు. తొలి దశలో రూ.1,650 కోట్లతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని 11 నియోజకవర్గాల్లో 39.64 లక్షల మందికి, రెండో దశలో రూ.1,400 కోట్లతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని 12 నియోజకవర్గాల్లో 28.18 లక్షల మందికి తాగునీటిని అందిస్తారు. జల్ జీవన్ మిషన్ నిధులతో చేపట్టే ఈ ప్రాజెక్టును రాబోయే రెండేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ ప్రాజెక్టుపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గోదావరి డెల్టా ప్రజల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని తెలిపారు. భూగర్భ జలాలు కలుషితం కావడం వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని, ఈ సమస్యకు వాటర్ గ్రిడ్ ద్వారా స్వస్తి పలుకుతామని ఆయన అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను నిర్మించి, పైప్‌లైన్ల ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన నీటిని సరఫరా చేస్తామని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవతో ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చుతోందని తెలిపారు. శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేస్తున్న పవన్ కల్యాణ్‌కు ఘనస్వాగతం పలకాలని, ప్రజలు, కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Pawan Kalyan
Godavari Water Grid
Andhra Pradesh
Water Project
Drinking Water
Jal Jeevan Mission
Chandrababu Naidu
East Godavari
West Godavari
Kandula Durgesh

More Telugu News