Ram Gopal Varma: 'ధురంధర్' నుంచి ఈ పాఠాలు నేర్చుకోండి: ఫిలిం మేకర్లకు ఆర్జీవీ క్లాస్

Dhurandar a Lesson for Filmmakers Says Ram Gopal Varma
  • ఫిలిం మేకర్లకు సలహాలిచ్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ
  • హీరో ఎలివేషన్లు, లౌడ్ బీజీఎంల ట్రెండ్‌పై విమర్శలు
  • సౌత్ యాక్షన్ దర్శకులపై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు
తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉండే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, తాజాగా ఫిల్మ్ మేకర్లకు కొన్ని ఆసక్తికర సూచనలు చేశారు. బాలీవుడ్‌లో ఇటీవల వచ్చిన సూపర్ హిట్ మూవీ 'ధురంధర్' చిత్రాన్ని ఉదాహరణగా చూపిస్తూ, సినిమా నిర్మాతలు నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయని ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాల పేరుతో వస్తున్న చిత్రాలపై ఆయన విమర్శలు గుప్పించారు.

"సోకాల్డ్ పాన్ ఇండియా సినిమాల్లోలాగా, 'ధురంధర్' చిత్రంలో హీరోను ఎలివేట్ చేసే ప్రయత్నం చేయలేదు. స్లో మోషన్ షాట్లు, చెవులు చిల్లులుపడే నేపథ్య సంగీతంతో హీరోను బలవంతంగా దేవుడిని చేయలేదు. కథానుసారం మరో నటుడు అక్షయ్ ఖన్నాకు ప్రాధాన్యతనివ్వడాన్ని అంగీకరించిన స్టార్ రణ్‌వీర్ సింగ్‌కు సినిమాపై ఉన్న అవగాహన అద్భుతం" అని వర్మ ప్రశంసించారు.

ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల విషయంలో సౌత్ ఇండియా పాన్ ఇండియా యాక్షన్ డైరెక్టర్లకు ఆయన చురకలంటించారు. "ఈ సినిమాలో హింసను కేవలం చప్పట్లు కొట్టించే అంశంగా కాకుండా, ఒక మానసిక ఆఘాతంగా చూపించారు. యాక్షన్ డైరెక్టర్ ఏజాజ్ గులాబ్ పనితీరు అద్భుతం. ఆయన ప్రతి ఫైట్‌లో పాత్రల మానసిక స్థితిని చూపించారు. ఇది భారత సినిమాలలో నేను చూసిన అత్యుత్తమ యాక్షన్. మన సౌత్ యాక్షన్ దర్శకులు ఏజాజ్ నుంచి చాలా నేర్చుకోవాలి" అని వర్మ అభిప్రాయపడ్డారు.

అలాగే, మూస ధోరణిలో కాకుండా వాస్తవ జీవితంలా అనూహ్యంగా సాగే కథనం, ప్రేక్షకుడి తెలివిని నమ్మడం, సౌండ్ డిజైన్‌ను ఒక ప్రధాన పాత్రగా మార్చడం వంటి అంశాలను ఆయన కొనియాడారు. 'ధురంధర్' కేవలం ఒక బ్లాక్‌బస్టర్ కాదని, ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇదొక హెచ్చరిక అని పేర్కొన్నారు. భారతీయ సినిమాను ఉన్నత స్థాయికి తీసుకెళ్లి, తమలాంటి ఫిల్మ్ మేకర్లకు స్ఫూర్తినిచ్చిన దర్శకుడు ఆదిత్య ధర్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 
Ram Gopal Varma
Dhurandar
Bollywood
Pan India movies
Aditya Dhar
Akshay Khanna
Ranveer Singh
Indian cinema
Action directors
Film making

More Telugu News