Sharif Usman Hadi: హాదీ మృతితో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్.. ఎవరీ హదీ?

Bangladesh Student Leader Sharif Usman Hadi Dies After Attack
  • గత వారం హాదీపై కాల్పులు జరిపిన గుర్తు తెలియని వ్యక్తులు
  • సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • భారత్ వ్యతిరేక వైఖరితో గుర్తింపు పొందిన హాదీ
బంగ్లాదేశ్‌లో గతేడాది జరిగిన విద్యార్థి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన యువ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదీ (32) కన్నుమూశారు. గతవారం ఎన్నికల ప్రచారంలో ఉండగా దుండగులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆయన, సింగపూర్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆరు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన హాదీ నిన్న రాత్రి మృతి చెందారు.

డిసెంబర్ 12న ఢాకాలోని పల్టన్ ప్రాంతంలో ఆటోరిక్షాలో ప్రచారం నిర్వహిస్తుండగా, ముసుగు ధరించిన దుండగులు ఆయన తలపై కాల్పులు జరిపారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం మెరుగైన వైద్యం కోసం ఎయిర్ అంబులెన్స్‌లో సింగపూర్‌కు తరలించింది. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. హాదీ మృతదేహాన్ని ఢాకాకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

హాదీ మరణవార్త తెలియగానే బంగ్లాదేశ్‌ వ్యాప్తంగా వేలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. హంతకులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రభుత్వం హంతకుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టింది. ఇద్దరు ప్రధాన నిందితుల ఫొటోలను విడుదల చేసి, వారి ఆచూకీ తెలిపిన వారికి 5 మిలియన్ టాకా (సుమారు $42,000) రివార్డు ప్రకటించింది. సరిహద్దుల్లో భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు.

ఎవరీ ఉస్మాన్ హాదీ?
గతేడాది షేక్ హసీనా 15 ఏళ్ల పాలనకు వ్యతిరేకంగా జరిగిన విద్యార్థి ఉద్యమంలో హాదీ ముందువరుసలో నిలిచారు. ఆయన ఇంక్విలాబ్ మంచ్ అనే విద్యార్థి సంస్థలో కీలక నాయకుడు. రానున్న ఎన్నికల్లో ఢాకా-8 నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనకు తీవ్రమైన భారత వ్యతిరేక వైఖరి ఉందని, 'గ్రేటర్ బంగ్లాదేశ్' పేరుతో భారత భూభాగాలను కలుపుతూ మ్యాపులను ప్రచారం చేశారని కథనాలున్నాయి.

హాదీ మృతికి సంతాపంగా శనివారం జాతీయ సంతాప దినం పాటిస్తున్నట్లు తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్ ప్రకటించారు. ప్రభుత్వ భవనాలపై జాతీయ జెండాను అవనతం చేయనున్నారు. హాదీ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ హత్య వెనుక భారత ప్రమేయం ఉందని బంగ్లాదేశ్‌లోని కొన్ని వర్గాలు ఆరోపించగా, ఆ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది.
Sharif Usman Hadi
Bangladesh
Student Protest
Sheikh Hasina
Dhaka
Bangladesh Election
Greater Bangladesh
Inquilab Manch
Mohammad Yunus

More Telugu News