Delhi Air Pollution: ఢిల్లీని కమ్మేసిన దట్టమైన పొగమంచు.. 152 విమానాల రద్దు

Delhi Airport 152 Flights Cancelled Due to Dense Fog
  • ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న‌ వాయు కాలుష్యం
  • ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేసిన ఎయిర్‌లైన్స్
  • ఉత్తరప్రదేశ్‌లోనూ రెండు రోజుల పాటు పొగమంచు హెచ్చరిక
దేశ రాజధాని ఢిల్లీని శుక్రవారం దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీని కారణంగా దృశ్య స్పష్టత తీవ్రంగా పడిపోవడంతో విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. ఢిల్లీ విమానాశ్రయంలో ఒకే రోజు 152 విమానాలను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. రద్దయిన వాటిలో 79 ఇత‌ర గ‌మ్య‌స్థానాల‌కు వెళ్లేవి ఉంటే, 73 నగరానికి వచ్చేవి ఉన్నాయి.

ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ ‘క్యాట్ III’ (CAT III) నిబంధనల కింద పనిచేస్తోంది. దీంతో అనేక విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రయాణికులు తమ విమాన సర్వీసుల సమాచారం కోసం సంబంధిత ఎయిర్‌లైన్స్‌ను సంప్రదించాలని ఎయిర్‌పోర్ట్ అధికారులు ఎక్స్ (ట్విట్ట‌ర్‌) ద్వారా సూచించారు. ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి పలు విమానయాన సంస్థలు కూడా వాతావరణం కారణంగా సర్వీసులకు అంతరాయం కలగొచ్చని ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేశాయి.

పొగమంచుతో పాటు వాయు కాలుష్యం కూడా ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గాలి నాణ్యత సూచీ (AQI) 380కి పడిపోయింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలోని నోయిడా, ఘజియాబాద్‌లలో దృశ్య స్పష్టత 100 మీటర్ల కంటే తక్కువగా నమోదైంది. దీంతో భారత వాతావరణ శాఖ (IMD) నగరానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఇదే తరహా పరిస్థితి ఉత్తరప్రదేశ్‌లోనూ నెలకొంది. అక్కడ కూడా రానున్న రెండు రోజులకు పొగమంచు హెచ్చరికలు జారీ చేశారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు వాహనాల వేగాన్ని నియంత్రించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. రేపు కాస్త ఉపశమనం లభించినా, ఆది, సోమవారాల్లో మళ్లీ దట్టమైన పొగమంచు ఏర్పడుతుందని ఐఎండీ అంచనా వేసింది.
Delhi Air Pollution
Delhi fog
Delhi Airport
fog
flight cancellations
CAT III
air quality index
IMD
Uttar Pradesh
Yogi Adityanath
yellow alert

More Telugu News