Reliance Jio: వైద్య రంగంలో 'జియో' మరో సంచలనం.. రూ.1000కే క్యాన్సర్ ముందస్తు పరీక్ష!

Reliance Jio Affordable Cancer Test for Rs 1000
  • వైద్య పరీక్షల రంగంలోకి దిగుతున్న రిలయన్స్ సంస్థ
  • రూ.10 వేల విలువైన టెస్ట్‌ను రూ.1000కే అందించే ప్రణాళిక
  • జినోమిక్ సైన్స్ ద్వారా భవిష్యత్ రోగాల ముందస్తు గుర్తింపు
  • బెంగళూరుకు చెందిన స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్‌తో సేవలు
  • సామాన్యులకు అందుబాటులోకి తేవడమే లక్ష్యమన్న ముఖేశ్ అంబానీ
టెలికం రంగంలో జియోతో సంచలనం సృష్టించిన రిలయన్స్ సంస్థ ఇప్పుడు వైద్య పరీక్షల రంగంలో మరో భారీ విప్లవానికి సిద్ధమవుతోంది. భవిష్యత్తులో వచ్చే వ్యాధులను ముందుగానే పసిగట్టేందుకు ఉపయోగపడే జెనెటిక్ పరీక్షలను అత్యంత చౌకగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం మార్కెట్‌లో రూ.10,000 ఉన్న క్యాన్సర్ ముందస్తు నిర్ధారణ పరీక్షను కేవలం రూ.1000కే అందించాలని యోచిస్తోంది.

నాలుగేళ్ల క్రితం రూ.393 కోట్లతో కొనుగోలు చేసిన బెంగళూరుకు చెందిన 'స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్' సంస్థ ద్వారా రిలయన్స్ ఈ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించనుంది. ఈ సంస్థ జినోమిక్ సైన్స్ టెక్నాలజీని ఉపయోగించి రక్తం, లాలాజలం లేదా శరీర కణజాల నమూనాలతో భవిష్యత్తులో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను గుర్తిస్తుంది. ముఖ్యంగా క్యాన్సర్ వంటి వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించడానికి ఈ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఈ ప్రణాళికపై రిలయన్స్ సీనియర్ అధికారి, స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ నీలేశ్ మోదీ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు వైద్య పరీక్షలు అందుబాటులో ఉండాలనేది ముఖేశ్ అంబానీ లక్ష్యమని, అందుకే ఈ ప్రాజెక్టుకు ప్రత్యేకంగా టైమ్‌లైన్ పెట్టుకోలేదని తెలిపారు. చౌక ధరలకే పరీక్షలు అందించి సమాజంపై తమదైన ముద్ర వేయాలనుకుంటున్నామని వివరించారు.

ఇప్పటికే ఈ సంస్థ 'క్యాన్సర్ స్పాట్' అనే ఏఐ (కృత్రిమ మేధ) ఆధారిత జినోమ్ సీక్వెన్సింగ్ మోడల్‌ను అభివృద్ధి చేసింది. దీని ద్వారా కాలేయం, రొమ్ము, కడుపు క్యాన్సర్లతో సహా పది రకాల క్యాన్సర్లను ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చు. అయితే ఇది కేవలం స్క్రీనింగ్ పరీక్ష మాత్రమే. ఇందులో పాజిటివ్‌గా తేలితే, కచ్చితమైన నిర్ధారణ కోసం తదుపరి పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ టెస్టులో పాజిటివ్ వచ్చిన 100 మందిలో 20 నుంచి 30 మందికి క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అవుతోందని సంస్థ వర్గాలు తెలిపాయి.
Reliance Jio
Jio
Mukesh Ambani
Cancer detection
Genetic testing
Strand Life Sciences
Healthcare
Genomics
Nilesh Modi
Cancer Spot AI

More Telugu News