Harish Rao: నాకు.. కేటీఆర్‌కు మధ్య చిచ్చుపెట్టే కుట్ర: రేవంత్‌పై హరీశ్ ఫైర్

Harish Rao Conspiracy to Create Rift Between Me and KTR
  • రేవంత్‌రెడ్డికి పంచాయతీ ఫలితాలతో అసహనం పెరిగింది
  • నాకు, కేటీఆర్‌కు మధ్య విభేదాలు సృష్టించాలని కుట్ర
  • ఎప్పటికీ నా గుండెల్లో కేసీఆర్, చేతిలో గులాబీ జెండానే
  • కాంగ్రెస్ ప్రభుత్వ అక్రమాలపై కలిసికట్టుగా పోరాడతాం
  • కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేయడమే మా లక్ష్యం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. "అనేకసార్లు చెప్పా.. మళ్లీ చెబుతున్నా.. రాసి పెట్టుకోండి రేవంత్‌రెడ్డి.. ఎప్పటికైనా నా గుండెల్లో ఉండేది కేసీఆరే. నా చేతిలో ఉండేది గులాబీ జెండానే" అని ఆయన స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలతో సీఎంకు అసహనం పెరిగిపోయిందని, ఓటమి భయంతోనే తనకూ, కేటీఆర్‌కు మధ్య విభేదాలు సృష్టించి బీఆర్ఎస్‌ను బలహీనపరచాలని చూస్తున్నారని ఆరోపించారు.

గురువారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రోజురోజుకీ పరిస్థితులు చేయిదాటిపోతున్నాయనే ఆందోళనతోనే సీఎం ఇష్టానుసారం మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయన చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు ఫలించవని హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అక్రమాలపై తానూ, కేటీఆర్ మరింత సమన్వయంతో, రెట్టించిన ఉత్సాహంతో పోరాడతామని తెలిపారు. తెలంగాణకు ద్రోహం చేస్తున్న కాంగ్రెస్‌ను గద్దె దించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

చిల్లర రాజకీయాలు మానుకొని, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని రేవంత్‌కు హరీశ్‌రావు సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజలకు కష్టాలు మొదలయ్యాయని, మెదక్ జిల్లా రైతులు యాసంగి పంట వేయాలా వద్దా అనే గందరగోళంలో ఉన్నారని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో బోర్లు వేయని రైతులు.. ఇప్పుడు అప్పులు చేసి బోర్లు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ విజయపథంలో పయనించి, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు.
Harish Rao
Revanth Reddy
KTR
BRS
Telangana Politics
Telangana Congress
KCR
Political Conspiracy
Medak Farmers
Telangana Elections

More Telugu News