Gajendra Singh Shekhawat: 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం

Gajendra Singh Shekhawat Announces India eVisa for 171 Countries
  • దేశంలో పర్యాటక అభివృద్ధికి వేల కోట్లు.
  • స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద రూ. 2,208 కోట్లు కేటాయింపు
  • పర్యాటక ప్రచారం కోసం 'ఇన్‌క్రెడిబుల్ ఇండియా' డిజిటల్ పోర్టల్
  • రాజ్యసభలో వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్
భారత్‌లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా 171 దేశాల పౌరులకు 9 ఉప కేటగిరీల కింద ఈ-వీసా సౌకర్యాన్ని అందిస్తున్నట్లు వెల్లడించింది. దేశంలోని 31 అంతర్జాతీయ విమానాశ్రయాలు, 6 ప్రధాన ఓడరేవుల ద్వారా ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గురువారం రాజ్యసభకు తెలిపారు.

ఒక లిఖితపూర్వక సమాధానంలో ఆయన మాట్లాడుతూ.. పర్యాటక మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. "స్వదేశ్ దర్శన్ 2.0" పథకం కింద 53 ప్రాజెక్టుల కోసం రూ. 2,208.27 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే, 'ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్‌మెంట్' (CBDD) కార్యక్రమం కింద 36 ప్రాజెక్టులకు రూ. 648.11 కోట్లు కేటాయించినట్లు వివరించారు. ఈ నిధులను కేంద్రం విడుదల చేయగా, సంబంధిత రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ఏజెన్సీలు ప్రాజెక్టులను అమలు చేస్తాయని తెలిపారు.

పర్యాటక ప్రచారం కోసం 'ఇన్‌క్రెడిబుల్ ఇండియా' డిజిటల్ పోర్టల్‌ను విస్తృతంగా వినియోగిస్తున్నామని మంత్రి చెప్పారు. ఇందులో భాగంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్ల కోసం అధిక నాణ్యత గల ఫోటోలు, వీడియోలు, బ్రోచర్లతో 'ఇన్‌క్రెడిబుల్ ఇండియా కంటెంట్ హబ్'ను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. దీనితో పాటు సోషల్ మీడియా, ప్రత్యేక కార్యక్రమాల ద్వారా కూడా భారత పర్యాటకాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నట్లు ఆయన వివరించారు.
Gajendra Singh Shekhawat
India e-Visa
Indian Tourism
e-Visa facility
Swadesh Darshan 2.0
Incredible India
tourism infrastructure
CBDD program
tourism promotion

More Telugu News