Jagan Mohan Reddy: కోటి సంతకాల ప్రతులను గవర్నర్ కు అందజేశాం: జగన్

Jagan Mohan Reddy Submits 1 Crore Signatures to Governor Against Medical College Privatization
  • పీపీపీ విధానానికి వ్యతిరేకంగా కోటి సంతకాలు
  • గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు అందజేసిన వైఎస్ జగన్
  • ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్ అని తీవ్ర ఆరోపణ
రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్ అని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ విమర్శించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానాన్ని వ్యతిరేకిస్తూ సేకరించిన కోటి సంతకాల ప్రతులను నేడు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు సమర్పించామని జగన్ వెల్లడించారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్, చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తూ, రైతులను మోసం చేస్తూ, ఇప్పుడు పేదల వైద్య విద్యను కూడా దూరం చేయాలని చూస్తోందని ఆరోపించారు. ఒక్కో కాలేజీకి ఏటా రూ.120 కోట్ల జీతాలను ప్రభుత్వమే చెల్లిస్తూ, దాని నిర్వహణను ప్రైవేటుకు అప్పగించడం భారీ కుంభకోణమని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. ఈ ప్రైవేటీకరణ వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షగా మారుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అంతకుముందు, తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ ముఖ్య నేతలతో జగన్ సమావేశమయ్యారు. కేవలం రెండు నెలల్లో కోటి నాలుగు లక్షలకు పైగా సంతకాలు సేకరించడం చారిత్రాత్మకమని, ఇది ప్రజా ఉద్యమంగా మారిందని పార్టీ శ్రేణులను అభినందించారు. అనంతరం సంతకాల ప్రతులతో కూడిన వాహనాలను జెండా ఊపి లోక్‌భవన్‌కు పంపారు. సుమారు 40 మంది పార్టీ నాయకులతో కలిసి గవర్నర్‌ను కలిసిన జగన్, ప్రజల వ్యతిరేకతను ఆయనకు వివరించారు. ఈ ఉద్యమం ప్రజల నుంచి పుట్టిందని, పేదల హక్కులను కాపాడే వరకు కొనసాగుతుందని వైఎస్సార్‌సీపీ నేతలు స్పష్టం చేశారు.
Jagan Mohan Reddy
AP Medical Colleges
Medical College Privatization
YS Jagan
Andhra Pradesh
Governor Abdul Nazeer
Public Private Partnership
Health sector
YSRCP
Chandrababu Naidu

More Telugu News