Chandrababu Naidu: ఆ జిల్లాల్లో నేరాలు ఎందుకు పెరిగాయి?... పోలీసింగ్ అంటే భయం ఉండాలి!: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Focuses on Rising Crime Rates in Select AP Districts
  • కొన్ని జిల్లాల్లో నేరాలు పెరగడంపై చంద్రబాబు అసంతృప్తి
  • శాంతిభద్రతలే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని స్పష్టీకరణ
  • రాష్ట్రవ్యాప్తంగా 5.5 శాతం నేరాలు తగ్గాయన్న డీజీపీ
  • అన్నమయ్య, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో క్రైమ్ రేట్ పై విశ్లేషణకు ఆదేశం
రాష్ట్రంలో పోలీసింగ్ అంటే నేరస్థుల్లో భయం కలగాలని, శాంతిభద్రతల విషయంలో ఏమాత్రం ఉపేక్ష వద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కొన్ని జిల్లాల్లో నేరాల సంఖ్య పెరుగుతున్న తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో జిల్లా ఎస్పీలు, కలెక్టర్లతో శాంతిభద్రతలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో క్రైమ్ రేట్ మొత్తం మీద తగ్గినా, కొన్ని జిల్లాల్లో మాత్రం ఆందోళనకరంగా పెరగడానికి గల కారణాలను క్షుణ్ణంగా విశ్లేషించాలని అధికారులను ఆదేశించారు.

"అన్నమయ్య, కోనసీమ, నెల్లూరు, గుంటూరు, తిరుపతి జిల్లాల్లో నేరాలు ఎందుకు పెరిగాయో లోతుగా అధ్యయనం చేయాలి. కడప, అల్లూరి, ఏలూరు జిల్లాల్లో ఆస్తి సంబంధిత కేసులు ఎక్కువగా నమోదు కావడానికి కారణాలేమిటి? శాంతిభద్రతల పరిరక్షణే ప్రభుత్వానికి అత్యంత ముఖ్యం" అని చంద్రబాబు స్పష్టం చేశారు. జిల్లాల మధ్య నేరాల రేటులో ఇంత వ్యత్యాసం ఉండటంపై దృష్టి సారించాలని సూచించారు.

అంతకుముందు, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గతంతో పోలిస్తే రాష్ట్రవ్యాప్తంగా నేరాల రేటు 5.5 శాతం తగ్గిందని, ముఖ్యంగా మహిళలపై నేరాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని ఆయన వివరించారు. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో నేరాలు బాగా తగ్గినప్పటికీ, కొన్ని జిల్లాల్లో వేర్వేరు కారణాలతో క్రైమ్ ట్రెండ్ పెరుగుతోందని తెలిపారు. ఉదాహరణకు, అన్నమయ్య జిల్లాలో వలస కూలీల కారణంగా కొన్ని నేరాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో డిటెక్షన్ రేటు 56 శాతంగా, రికవరీ రేటు 55 శాతంగా ఉందని తెలిపారు.

ఈ సందర్భంగా విజయవాడ సీపీ రాజశేఖర బాబు మాట్లాడుతూ, టెక్నాలజీ వినియోగంతో నేరాలను అదుపు చేస్తున్నామని తెలిపారు. ఎన్టీఆర్, పశ్చిమగోదావరి సహా ఐదు జిల్లాల్లో సీసీటీవీల అనుసంధానంతో మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు. నగరంలో కమ్యూనిటీ సహకారంతో 10 వేల సీసీ కెమెరాలతో డ్యాష్ బోర్డును ఏర్పాటు చేశామని, ఫేస్ రికగ్నిషన్ కెమెరాల ద్వారా నిందితులను పట్టుకుంటున్నామని వివరించారు.

అయితే, మొత్తం మీద కొన్ని జిల్లాల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం, క్షేత్రస్థాయిలో పరిస్థితులను చక్కదిద్ది, ప్రజలకు భద్రతాభావం కల్పించాలని పోలీసు ఉన్నతాధికారులకు గట్టిగా సూచించారు.
Chandrababu Naidu
Andhra Pradesh Crime
AP Police
Crime Rate
Law and Order
Collector Conference
Harish Kumar Gupta
Vijayawada CP Rajasekhar Babu
Annamayya District
Guntur District

More Telugu News