నాకు మరో ట్యాగ్ వద్దు... అమ్మానాన్న ఇచ్చిన ట్యాగ్ చాలు: అడివి శేష్

  • పేరు ముందు ట్యాగ్‌లు పెట్టుకోవడం ఇష్టం ఉండదన్న అడివి శేష్
  • 'డెకాయిట్' చిత్ర టీజర్‌ హైదరాబాద్‌లో విడుదల 
  • వచ్చే ఏడాది ఉగాదికి 'డెకాయిట్
  • మంచి సినిమా ఇవ్వాలనే ఉద్దేశంతోనే గ్యాప్ తీసుకుంటున్నా అని అడివి శేష్ వెల్లడి
  • మృణాల్ ఠాకూర్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అని వ్యాఖ్యలు
హీరోలు తమ పేరు ముందు బిరుదులు, ట్యాగ్‌లు పెట్టుకోవడం సాధారణం. కానీ, యువ కథానాయకుడు అడివి శేష్ మాత్రం అందుకు భిన్నం. తన పేరుకు ముందు ఎలాంటి ట్యాగ్ పెట్టుకోకపోవడానికి గల కారణాన్ని ఆయన తాజాగా వెల్లడించారు. "మా అమ్మానాన్న నాకు చిన్నప్పుడే 'అడివి శేష్' అనే ట్యాగ్ ఇచ్చారు. అందుకే మరో ట్యాగ్ వద్దు అనుకున్నా. ఏదో ఒక ట్యాగ్ పెట్టుకుని, పీఆర్ వాళ్లతో లోగోలు చేయించుకోవడం నాకు నచ్చదు. తరతరాలు గుర్తుండిపోయే సినిమాలు తీసి ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించడమే నాకు ఇష్టం" అని ఆయన స్పష్టం చేశారు.

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ యాక్షన్ చిత్రం 'డెకాయిట్'. షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా శేష్ మాట్లాడుతూ, 'డెకాయిట్' చిత్రానికి మృణాల్ ఠాకూర్ ప్రత్యేక ఆకర్షణ అని తెలిపారు. సినిమాల మధ్య గ్యాప్ ఎందుకు వస్తుందన్న ప్రశ్నకు.. "ఒక చిన్న టీజర్ కోసమే గంటల తరబడి కష్టపడ్డాం. నాణ్యమైన సినిమాను ప్రేక్షకులకు అందించాలనేదే నా ఉద్దేశం. అందుకే ఆలస్యమైనా ఫర్వాలేదు" అని వివరించారు.

'డెకాయిట్' చిత్రం వచ్చే ఏడాది మార్చి 19న ఉగాదికి విడుదల కానుందని తెలిపారు. అలాగే, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'గూఢచారి 2' కూడా వచ్చే ఏడాదే మరో పండగకు వస్తుందని ప్రకటించారు. పెద్ద సినిమాల మధ్య విడుదల చేయడంపై నిర్మాత సుప్రియ మాట్లాడుతూ.. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారని, సినిమా విజయంపై నమ్మకం ఉందని అన్నారు. గతంలో అగ్ర హీరోల సినిమాల మధ్యే 'మేజర్' విడుదలై ఘన విజయం సాధించిందని అడివి శేష్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.


More Telugu News