నాంపల్లి కోర్టుకు హాజరైన మంత్రి సీతక్క

  • గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నమోదైన కేసు
  • కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని 2021లో ధర్నా
  • సీతక్కతో పాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా హాజరు
తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఈరోజు నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నమోదైన కేసు విచారణలో భాగంగా ఆమెతో పాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా కోర్టు ఎదుట హాజరయ్యారు.

2021లో కరోనా మహమ్మారి తీవ్రంగా ఉన్న సమయంలో, కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలని డిమాండ్ చేస్తూ సీతక్క, అప్పటి ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. కరోనా రోగులకు ఉచిత అంబులెన్స్ సేవలు అందించాలని, వ్యాధితో మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం చేయాలని వారు అప్పటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అయితే, లాక్‌డౌన్ నిబంధనలు అమల్లో ఉండగా ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహించి, కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారని ఆరోపిస్తూ అప్పటి కేసీఆర్ సర్కార్ సీతక్క, బల్మూరి వెంకట్‌పై కేసు నమోదు చేసింది. ఆ కేసుకు సంబంధించిన విచారణలో భాగంగానే ఇవాళ వారిద్దరూ న్యాయస్థానం ముందు హాజరయ్యారు.


More Telugu News