Revanth Reddy: కేసీఆర్ క్రియాశీలక రాజకీయాల్లో లేరు.. ఆయనతో ప్రయోజనం లేదని గజ్వేల్‌ ప్రజలకు అర్థమైంది: రేవంత్ రెడ్డి

Revanth Reddy Says KCR Inactive Led to Congress Win in Gajwel
  • పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు వచ్చాయన్న ముఖ్యమంత్రి
  • కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ఒక్క ఎన్నికను కూడా గెలవలేదని విమర్శ
  • 2029 ఎన్నికల్లోనూ ఇవే పునరావృతమవుతాయని వ్యాఖ్య
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్రియాశీలక రాజకీయాల్లో లేరని, అందుకే ఆయనతో ఎలాంటి ప్రయోజనం లేదని గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు ఇచ్చారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుతమైన ఫలితాలు సాధించిందని ఆయన అన్నారు. 12 వేలకు పైగా గ్రామపంచాయతీల్లో 7,500కు పైగా కాంగ్రెస్ విజయం సాధించిందని తెలిపారు.

కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ఒక్క ఎన్నికను కూడా గెలవలేదని ఆయన విమర్శించారు. హరీశ్ రావు నాయకత్వం మార్చాలని చూస్తున్నారని, అందుకే కేటీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ గురించి ఆలోచించడం లేదని అన్నారు. స్పీకర్ నిర్ణయాలు నచ్చకపోతే కోర్టులు ఉన్నాయని, అక్కడికి వెళ్లవచ్చని సూచించారు. కృష్ణా, గోదావరి జలాలపై అసెంబ్లీలో మూడు రోజులు చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని రేవంత్ రెడ్డి అన్నారు.

జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుతమైన ఫలితాలు సాధించిందని అన్నారు. 2029 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు పునరావృతమవుతాయని ధీమా వ్యక్తం చేశారు. 12,702 పంచాయతీలకు 7,527 చోట్ల కాంగ్రెస్, 808 చోట్ల కాంగ్రెస్ రెబల్స్ గెలుపొందారని వెల్లడించారు. 66 శాతం ఫలితాలు కాంగ్రెస్, రెబల్స్ సాధించారని అన్నారు.

బీఆర్ఎస్, బీజేపీ ఈ ఎన్నికల్లో ఒక కూటమిగా పోటీ చేస్తే, బీఆర్ఎస్ పార్టీకి 3,511, బీజేపీకి 710 స్థానాలు వచ్చాయని అన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయిన తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ప్రజలు ఆదరించినట్లుగా అర్థమైందని అన్నారు. 94 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పంచాయతీ ఎన్నికలు జరిగితే 87 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆధిక్యం సాధించిందని అన్నారు.

ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే పెద్దల సూచనను తాము పాటిస్తామని, ప్రతిపక్షాలకు మాత్రం ఇంకా అహంకారం తగ్గలేదని విమర్శించారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అందిస్తున్న సంక్షేమ పథకాలు ఈ విజయానికి కారణమని అన్నారు.
Revanth Reddy
KCR
BRS
Gajwel
Telangana
Congress
Panchayat Elections
KTR

More Telugu News