Lavu Sri Krishna Devarayalu: ఉపాధి హామీ పథకం పేరు మార్పు... టీడీపీ వైఖరి ఇదే!

TDP Supports Vikshit Bharat Bill Citing Economic Changes Says Lavu Sri Krishna Devarayalu
  • ఉపాధి హామీ పథకం పేరు మార్పును సమర్థించిన టీడీపీ
  • మారిన ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగానే ఈ మార్పులన్న ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు 
  • పాత పథకంలోని లోపాలు, దుర్వినియోగాన్ని ప్రస్తావించిన వైనం
  • కొత్త చట్టం మెరుగుకు లోక్‌సభలో ఐదు కీలక సూచనలు
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త చట్టాన్ని టీడీపీ సమర్థించింది. మారిన ఆర్థిక వాస్తవాలకు అనుగుణంగా ఈ మార్పులు అవసరమని స్పష్టం చేసింది. గురువారం లోక్‌సభలో 'వికసిత్ భారత్ - గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) (VB-G RAM G) బిల్లు-2025'పై జరిగిన చర్చలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడారు.

గ్రామీణ ఉపాధి పథకాలు 1969 నుంచి అనేక రూపాల్లో ఉన్నాయని, 2005లో వచ్చిన MGNREGA వాటికి కొనసాగింపు మాత్రమేనని ఆయన గుర్తుచేశారు. "గడిచిన 15 ఏళ్లలో ప్రజల ఆకాంక్షలు, ఆర్థిక వ్యవస్థలో మార్పులు వచ్చాయి. పేదరికం 2011-12లో 25 శాతం ఉండగా, 2023-24 నాటికి 4.8 శాతానికి తగ్గింది. కాబట్టి, మెరుగైన ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా పథకాలను సంస్కరించడం తప్పనిసరి" అని ఆయన అన్నారు.

పాత పథకంలో అనేక లోపాలు, నిధుల దుర్వినియోగం జరుగుతున్నాయని క్షేత్రస్థాయి నుంచి నివేదికలు వచ్చాయని శ్రీకృష్ణ దేవరాయలు పేర్కొన్నారు. చాలా రాష్ట్రాల్లో పనులు జరగకుండానే వేతనాలు చెల్లించినట్లు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తులో తేలిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిపాదించిన మార్పులు సరైనవని, సకాలంలో తీసుకున్న నిర్ణయమని అభిప్రాయపడ్డారు.

కొత్త పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ఆయన ఐదు కీలక సూచనలు చేశారు. అక్రమాలను నిరోధించడానికి చట్టపరమైన నిబంధనలను కఠినతరం చేయాలని, సాంకేతిక సహాయకుల సంఖ్యను పెంచాలని, వేతనాల సవరణను ద్రవ్యోల్బణానికి అనుగుణంగా చేపట్టాలని కోరారు. వ్యక్తిగత ఆస్తుల కల్పన కంటే సామూహిక ఆస్తుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రతి రాష్ట్రంలో స్వతంత్ర సోషల్ ఆడిట్ యూనిట్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను కూడా ఈ సంస్కరణల అమలులో పరిగణనలోకి తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Lavu Sri Krishna Devarayalu
MGNREGA
Vikshit Bharat
Narasaraopet MP
TDP
Rural Employment Scheme
Andhra Pradesh
Economic Reforms
NREGA
Employment Guarantee Scheme

More Telugu News