నేషనల్ హెరాల్డ్ కేసు: బీజేపీ కార్యాలయం వరకు వెళ్లేందుకు కాంగ్రెస్ యత్నం.. అడ్డుకున్న పోలీసులు

  • నేషనల్ హెరాల్డ్ కేసులో గాంధీ కుటుంబాన్ని ఈడీ కేసులతో వేధిస్తున్నారని ఆరోపణ
  • గాంధీ భవన్ నుంచి బీజేపీ కార్యాలయం వరకు కవాతుకు ప్రయత్నం
  • కాంగ్రెస్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ కేసులతో వేధిస్తున్నారని ఆరోపిస్తూ తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు హైదరాబాదులో గాంధీ భవన్ నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం దిశగా కవాతు చేయడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఏఐసీసీ రాష్ట్ర ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు నిరసన ర్యాలీకి సిద్ధమయ్యారు.

వారు సమీపంలోనే ఉన్న బీజేపీ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు గాంధీ భవన్ ఎదుట బైఠాయించారు. నగరం నడిబొడ్డున ఉన్న నాంపల్లి ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్ ప్రాంగణం నుంచి బయటకు రాకుండా పోలీసులు గేట్లు మూసివేశారు.

వారు కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో గాంధీ భవన్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నిరసనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ట్రాఫిక్‌ను పునరుద్ధరించేందుకు ప్రయత్నించారు.

ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, నేషనల్ హెరాల్డ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం గాంధీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం మానివేయాలని అన్నారు. తన తప్పును బీజేపీ అంగీకరించి సోనియా గాంధీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ప్రతిపక్ష నాయకుడిని లక్ష్యంగా చేసుకుని, కాంగ్రెస్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు చేపట్టింది. వరంగల్, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్ సహా వివిధ ప్రాంతాల్లో నిరసన ర్యాలీలు చేపట్టారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులను పెద్ద ఎత్తున మోహరించారు. కరీంనగర్‌లో బండి సంజయ్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించగా, బీజేపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు నిలువరించారు.


More Telugu News