Susana: ఉన్నపళంగా ఉద్యోగాలు ఊస్ట్.. అమెరికాలో టీచర్ల కన్నీటి గాథ.. చిన్నారుల్లో మానసిక ఆందోళన

Immigrant Teachers in America Struggle with Work Permit Renewals
  • ట్రంప్ వలస విధానాలతో అమెరికాలో టీచర్లకు కష్టాలు
  • పనిచేస్తున్న వారి వర్క్ పర్మిట్లను తిరస్కరిస్తున్న అధికారులు
  • టీచర్లు ఉన్నపళంగా దూరమవడంతో చిన్నారులపై తీవ్ర ప్రభావం
  • విదేశీ సిబ్బందిపై ఆధారపడ్డ పాఠశాలల యాజమాన్యాల ఆందోళన
గత రెండేళ్లుగా సుసానా దినచర్య అంతా చిన్నారుల పాటలు, ఆటపాటలతోనే గడిచింది. కానీ, అక్టోబర్‌లో ఆమె జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. ఆమె వర్క్ పర్మిట్ రెన్యువల్ దరఖాస్తును అమెరికా అధికారులు తిరస్కరించడంతో ప్రీ-స్కూల్ టీచర్‌గా తన ఉద్యోగాన్ని తక్షణమే వదులుకోవాల్సి వచ్చింది. ఇది కేవలం సుసానా కథ మాత్రమే కాదు, అమెరికాలో పనిచేస్తున్న వేలాది మంది వలస టీచర్ల ఆవేదనకు అద్దం పడుతోంది.

దాదాపు పదేళ్ల క్రితం గ్వాటెమాలలో హింస నుంచి తప్పించుకుని అమెరికాలో ఆశ్రయం పొందిన సుసానా, తన గుర్తింపును గోప్యంగా ఉంచాలని కోరుతున్నారు. తన విద్యార్థులకు వీడ్కోలు చెప్పిన క్షణాలను ఆమె ఆవేదనతో గుర్తుచేసుకున్నారు. "ఒక్క వారంలోనే నేను సర్వస్వం కోల్పోయాను. నేను వెళ్ళిపోతున్నానని చెప్పినప్పుడు, ఎందుకని అడిగిన పిల్లలకు సమాధానం చెప్పలేకపోయాను. కొందరు పిల్లలు నన్ను కౌగిలించుకున్నప్పుడు నా గుండె తరుక్కుపోయింది" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

అమెరికాలో మొత్తం టీచర్లలో దాదాపు 10 శాతం మంది వలసదారులే ఉన్నారు. దేశవ్యాప్తంగా టీచర్ల కొరత తీవ్రంగా ఉండటంతో, ప్రభుత్వం విదేశాల నుంచి నిపుణులను ఆహ్వానిస్తోంది. 2023-24 విద్యా సంవత్సరంలోనే 6,716 మంది టీచర్లను తాత్కాలిక వీసాలపై అమెరికాకు రప్పించారు. అయితే, డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం వలసదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తుండటంతో, ఇప్పటికే చట్టబద్ధంగా పనిచేస్తున్న వారి ఉపాధి ప్రమాదంలో పడింది.

సుసానా పనిచేసిన వాషింగ్టన్‌లోని 'కమ్యూనికిడ్స్' లాంగ్వేజ్ స్కూల్ దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ఈ పాఠశాలలోని 90 శాతం సిబ్బంది వలస నేపథ్యం ఉన్నవారే. స్కూల్ సహ-వ్యవస్థాపకుడు రాల్ ఎచెవర్రియా మాట్లాడుతూ, ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల తమ సిబ్బంది తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. వెనిజువెలాకు చెందిన ఐదుగురు టీచర్ల టెంపరరీ ప్రొటెక్టెడ్ స్టేటస్ (TPS)ను రద్దు చేయడంతో, 2026 అక్టోబర్ నాటికి వారి వర్క్ పర్మిట్లు ముగిసిపోనున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ పరిణామాలు కేవలం టీచర్ల జీవితాలనే కాకుండా, చిన్నారుల మానసిక ఆరోగ్యంపై, చదువుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. "మా విద్యార్థులకు వారి టీచర్లతో బలమైన అనుబంధం ఉంటుంది. ఉన్నట్టుండి టీచర్లు దూరమవడం వారిని మానసికంగా కుంగదీస్తోంది" అని ఎచెవర్రియా అన్నారు. 

విద్యా సంవత్సరం మధ్యలోనే టీచర్లు మారిపోతే పిల్లల భాషా నైపుణ్యాల అభివృద్ధి దెబ్బతింటుందని ఇటీవల ఒక అధ్యయనం కూడా తేల్చింది. ఈ భయానక వాతావరణం కారణంగా పాఠశాలల్లో అత్యవసర ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. అమెరికా పౌరుడైనప్పటికీ, తాను కూడా పాస్‌పోర్ట్‌ను వెంట తీసుకెళుతున్నానని ఎచెవర్రియా చెప్పడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది.
Susana
USA teachers
teacher shortage
work permit
immigrant teachers
student mental health
Communikids Language School
Trump administration
temporary protected status
language skills

More Telugu News