Sajeeb Wazed: బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం.. భారత్‌కు పెనుముప్పు: షేక్ హసీనా కుమారుడు సాజిబ్

Sajeeb Wazed warns India of political crisis in Bangladesh
  • ఉగ్రవాద శిబిరాలు పుట్టుకు వస్తున్నాయన్న సాజిబ్ వాజేద్
  • బంగ్లాలో ఉగ్రచర్యలు భారత్ వంటి దేశాలకు ముప్పేనని వ్యాఖ్య
  • లష్కరే తోయిబా కమాండర్లు బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారన్న సాజిబ్
బంగ్లాదేశ్‌లో ఉగ్రవాద శిక్షణ శిబిరాలు వెలుస్తున్నాయని, అల్‌ఖైదాకు చెందిన వ్యక్తులు అక్కడ చురుగ్గా పనిచేస్తున్నారని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సాజిబ్ వాజేద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగ్లాలో ఇలాంటి ఉగ్రచర్యలు భారత్‌కు పెనుముప్పు అని ఆయన హెచ్చరించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం భారత్‌కు అత్యంత ప్రమాదకరం అని అన్నారు.

ప్రజాస్వామ్యాలను అణగదొక్కేలా ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం విధానాలను అనుసరిస్తోందని ఆరోపించారు. ఇస్లామిక్ పార్టీలకు అధికారం కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ఈ మార్పు భారత్‌పై ప్రత్యక్ష ప్రభావం చూపనుందని తెలిపారు. 

లష్కరే తోయిబా కమాండర్లు బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడుతున్నారని వెల్లడించారు. ఇవన్నీ భారత్‌కు ముప్పేనని, ఇది వాస్తవమని వ్యాఖ్యానించారు. జమాతే ఇస్లామీ వంటి ఇతర ఇస్లామిక్ పార్టీలకు తాత్కాలిక ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తోందని ఆరోపించారు. అలాంటి శక్తుల ప్రభావంతో బంగ్లాదేశ్‌లో అస్థిరత నెలకొందని అన్నారు.

దేశంలోని సగం మంది ఓటర్లను తాత్కాలిక ప్రభుత్వం రద్దు చేస్తోందని ఆరోపించారు. గతంలో ఇస్లామిక్ సంస్థలపై అవామీ లీగ్ పాలనలో విధించిన ఆంక్షలను యూనస్ ప్రభుత్వం సడలిచిందని ఆయన అన్నారు.

భారత్‌కు వ్యతిరేకంగా ఉన్న పాక్ వంటి దేశాలతో బంగ్లాదేశ్ తాత్కాలిక సర్కారు అంటకాగుతోందని విమర్శించారు. అవామీలీగ్ అధికారంలో ఉన్నప్పుడు భారత తూర్పు సరిహద్దులను ఉగ్రవాదుల నుంచి సురక్షితంగా ఉంచామని గుర్తు చేశారు. బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యం తిరిగి రావాలని, ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
Sajeeb Wazed
Bangladesh
India
political crisis
terrorism
Al Qaeda
Lashkar-e-Taiba

More Telugu News