MK Stalin: ఆమె లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు: సీఎం స్టాలిన్

CM Stalin credits wife Durga for his success
  • త‌న‌ సక్సెస్‌కు కారణం త‌న‌ భార్యేనన్న సీఎం స్టాలిన్
  • 15 జంటలకు స్వయంగా దగ్గరుండి వివాహం జరిపించిన సీఎం
  • కొళత్తూరుతో తనకు విడదీయరాని బంధం ఉందన్న స్టాలిన్
  • భార్యలను గౌరవంగా చూసుకోవాలని వరులకు సూచన
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తన అర్ధాంగి దుర్గ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి మగాడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుందని అంటుంటారని, తన విజయం వెనుక మాత్రం తన భార్య దుర్గ ఉందని ఆయన అన్నారు. కొళత్తూరులో రూ. 25.72 కోట్ల వ్యయంతో నిర్మించిన అణ్ణా కల్యాణ మండపాన్ని ఇవాళ‌ ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన 15 జంటలకు దగ్గరుండి వివాహాలు జరిపించారు. కార్యక్రమానికి ముందు కొళత్తూరులో రోడ్‌షో నిర్వహించగా, ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం సభలో స్టాలిన్ మాట్లాడుతూ.. కొళత్తూరుతో తనకు విడదీయరాని అనుబంధం ఉందని, తన రాజకీయ జీవితంలో ఈ ప్రాంతం ఎంతో కీలకమని గుర్తుచేసుకున్నారు. కొళత్తూరు తన పేరుతో ముడిపడిపోయిందని ఆయన పేర్కొన్నారు.

తాను ఎదుర్కొన్న క్లిష్ట సమయాల్లో తన భార్య దుర్గ అండగా నిలిచిందని స్టాలిన్ గుర్తుచేసుకున్నారు. ఒకవేళ ఆ కష్టకాలంలో ఆమె తనను విడిచిపెట్టి ఉంటే తన జీవితం, కెరీర్ మరోలా ఉండేవని భావోద్వేగంగా చెప్పారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు ఆయన పలు సూచనలు చేశారు. వివాహ బంధంలో పరస్పర మద్దతు, గౌరవం, ఓపిక చాలా ముఖ్యమని హితవు పలికారు. ముఖ్యంగా వరులను ఉద్దేశించి మాట్లాడుతూ.. తమ భార్యలను గౌరవంగా చూసుకోవాలని, విజయవంతమైన జీవితానికి వారి పాత్ర ఎంతో కీలకమని గుర్తించాలని సూచించారు.

అభివృద్ధి కేవలం కొళత్తూరుకే పరిమితం కాదని, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను తమ సొంత నియోజకవర్గాలుగా భావించి సమానంగా అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు. అనంతరం 15 జంటలను స్టాలిన్ స్వయంగా ఆశీర్వదించి, వారి వివాహ వేడుకను పూర్తిచేశారు.
MK Stalin
Tamil Nadu CM
Durga Stalin
Kolathur
Anna Kalyana Mandapam
Tamil Nadu Politics
Marriage Advice
Roadshow
Tamil Nadu Development

More Telugu News