Undavalli Arun Kumar: పోలవరం ప్రాజెక్టు పనులపై ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్ర విమర్శలు

Undavalli Arun Kumar Criticizes Polavaram Project Works
  • కూటమి ప్రభుత్వంలో కూడా పోలవరం పరిస్థితి మారలేదన్న ఉండవల్లి
  • సీఎం, మంత్రుల పర్యటనలతో పనుల్లో జాప్యం జరుగుతోందని వ్యాఖ్య
  • విఫలమైన కంపెనీకే మళ్ళీ డయాఫ్రం వాల్ పనులు అప్పగించారని విమర్శ
రాష్ట్రంలో కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడినా పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడకనే సాగుతున్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు తరచూ ప్రాజెక్టును సందర్శించడం వల్ల పనులు వేగవంతం కాకపోగా, మరింత జాప్యం జరుగుతోందని ఆయన ఆరోపించారు. వారి పర్యటనల సమయంలో మొత్తం అధికార యంత్రాంగం అంతా వారి చుట్టూనే తిరగాల్సి వస్తోందని, ఇది పనులపై ప్రభావం చూపుతోందని అన్నారు.

ఈరోజు రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉండవల్లి మాట్లాడారు. పోలవరంలో గతంలో దెబ్బతిన్న డయాఫ్రం వాల్ స్థానంలో కొత్తది నిర్మిస్తున్నారని, అయితే గతంలో రూ.440 కోట్లతో డయాఫ్రం వాల్ విఫలం కాగా, అదే బావర్ కంపెనీకి ఇప్పుడు రూ.990 కోట్లతో పనులు ఎలా అప్పగించారని ప్రశ్నించారు. ఈ వైఫల్యంపై ప్రభుత్వం ఎందుకు విచారణ జరపడం లేదని నిలదీశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదం వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతిందని గత సీఎం జగన్ స్పష్టం చేశారని గుర్తుచేశారు.

పోలవరం డయాఫ్రం వాల్ వైఫల్యంపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదని ఉండవల్లి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సమాచార హక్కు చట్టం కింద నివేదికను అడిగితే ‘కాపీరైట్’ వర్తిస్తుందని చెప్పడం దారుణమన్నారు. డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడం మానవ తప్పిదమా లేక భారీ వరదల వల్ల జరిగిందా అనే విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇదే సందర్భంగా, గతంలో జరిగిన గోదావరి పుష్కరాల తొక్కిసలాటకు ముహూర్తం అనే మూఢనమ్మకమే కారణమని కమిషన్ తేల్చినా, అప్పట్లో బీజేపీతో పొత్తులో ఉండటం వల్ల టీడీపీ ప్రభుత్వం మౌనంగా ఉందని ఉండవల్లి విమర్శించారు.
Undavalli Arun Kumar
Polavaram project
Andhra Pradesh
Chandrababu Naidu
Diaphragm wall
Bauer company
Godavari Pushkaralu
AP Politics
Jagan Mohan Reddy
Polavaram Dam

More Telugu News