Jagan Mohan Reddy: చంద్రబాబు గ్రాఫ్ పడిపోతోందని స్వయంగా ఆయనే చెప్పుకున్నారు: జగన్

Jagan Slams Chandrababu Says His Graph is Falling
  • కోటి సంతకాల ఉద్యమం చారిత్రక విజయం అన్న జగన్
  • మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అతిపెద్ద స్కాం అని ఆరోపణ
  • ప్రైవేటుకు కాలేజీలిచ్చి జీతాలు ఎలా ఇస్తారని ప్రభుత్వానికి ప్రశ్న
  • కూటమి పాలనలో సంక్షేమ పథకాలు రద్దు చేశారని విమర్శ
  • చంద్రబాబు తన తప్పులను కలెక్టర్లపై నెడుతున్నారని వ్యాఖ్య
చంద్రబాబు ప్రభుత్వంపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 'కోటి సంతకాల ఉద్యమం' చారిత్రక విజయం సాధించిందని, ఇంత పెద్ద సంతకాల ఉద్యమం దేశ చరిత్రలోనే జరగలేదని అన్నారు. ముఖ్యంగా, మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు కట్టబెట్టడం అతిపెద్ద స్కాం అని ఆయన ఆరోపించారు.

పార్టీ ముఖ్య నేతలతో ఈరోజు సమావేశమైన ఆయన మాట్లాడుతూ... ‘‘ప్రైవేటుకు కాలేజీలు ఇచ్చి, మళ్లీ రూ.120 కోట్ల ప్రజాధనాన్ని జీతాల కింద ఎలా ఇస్తారు? ఇంతకంటే పెద్ద స్కాం ఉంటుందా?’’ అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఈ ఉద్యమంలో భాగంగా కోటి 4 లక్షల 11 వేల 136 మంది సంతకాలు చేశారని, ఇది ఒక చరిత్ర అని పేర్కొన్నారు. ఉద్యమాన్ని విజయవంతం చేసిన గ్రామస్థాయి కార్యకర్త నుంచి ప్రతి ఒక్కరికీ ఆయన అభినందనలు తెలిపారు.

చంద్రబాబు గ్రాఫ్ పడిపోతోందని స్వయంగా ఆయనే చెప్పుకున్నారని జగన్ వ్యాఖ్యానించారు. కూటమి పాలనలో రెండు బడ్జెట్‌లు ప్రవేశపెట్టినా ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. తమ హయాంలో అమలు చేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతు భరోసా వంటి పథకాలను రద్దు చేశారని ఆరోపించారు.

ప్రైవేటీకరణ అంటే దోపిడీ అని, విద్య, వైద్యం ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని జగన్ స్పష్టం చేశారు. తాము ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి బతికించామని, కానీ నేడు అన్ని వ్యవస్థలు తిరోగమనంలో ఉన్నాయని అన్నారు. చంద్రబాబు తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కలెక్టర్లపైకి నెట్టేస్తున్నారని ఆరోపించారు. 
Jagan Mohan Reddy
Chandrababu Naidu
YSRCP
Andhra Pradesh Politics
Medical Colleges Privatization
Fee Reimbursement
Rythu Bharosa
Political Criticism
Telugu News
AP Government

More Telugu News