ప్యాకేజ్డ్ ఫుడ్‌పై పిల్ కొట్టివేత.. అది ధనికుల భయమన్న సుప్రీంకోర్టు

  • ప్యాకేజ్డ్ ఫుడ్‌పై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం కొట్టివేత
  • ఇది పట్టణ ధనికుల భయమంటూ సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్య
  • దేశంలో చాలామందికి కనీసం నీళ్లే దొరకవన్న ప్రధాన న్యాయమూర్తి
  • డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాలు పాటించాలంటూ దాఖలైన పిటిషన్
ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలు, తాగునీటిలో ఉండే క్యాన్సర్ కారక రసాయనాల పరిమితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రమాణాలను అమలు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. ఈ సందర్భంగా ఇది 'పట్టణ ధనికుల భయం' అంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, ఫుడ్ ప్యాకేజింగ్ నుంచి వెలువడే యాంటిమొనీ, డీఈహెచ్‌పీ వంటి రసాయనాలపై భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) నిర్దేశించిన నిబంధనలను పిటిషన్‌లో సవాలు చేశారు. వాటి స్థానంలో డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాలను అనుసరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

విచారణ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ.. దేశంలోని వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలని పిటిషనర్‌కు సూచించారు. "దేశంలో చాలా ప్రాంతాల్లో ప్రజలకు కనీసం తాగడానికి నీళ్లే దొరకడం లేదు. గాంధీజీ భారతదేశానికి వచ్చినప్పుడు పేద ప్రాంతాల్లో పర్యటించారు. ముందు పిటిషనర్‌ను అలాంటి ప్రాంతాలకు వెళ్లమనండి, అప్పుడు అసలు భారతదేశం అంటే ఏంటో ఆయనకు తెలుస్తుంది" అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఎఫ్ఎస్ఎస్ఏఐ నిర్దేశించిన ప్రమాణాలు చట్టవిరుద్ధమని, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, 2006లోని సెక్షన్ 18 ప్రకారం అంతర్జాతీయ నిబంధనలను పరిగణనలోకి తీసుకోవాలని పిటిషనర్ వాదించారు. యాంటిమొనీ, డీఈహెచ్‌పీ రసాయనాల వల్ల క్యాన్సర్ ముప్పుతో పాటు పురుషుల్లో పునరుత్పత్తి వ్యవస్థపై ప్రభావం పడుతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. కొత్త ప్రమాణాలను రూపొందించే వరకు డబ్ల్యూహెచ్‌ఓ నిబంధనలను పాటించాలని, ఈ రసాయనాల వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కూడా కోరారు. అయితే, ఈ వాదనలను తోసిపుచ్చిన న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేసింది.


More Telugu News