Ghaziabad murder: అద్దె బకాయి అడిగితే కొట్టి చంపారు.. ఘజియాబాద్ లో ఘోరం

Ghaziabad Crime Couple Kills Landlady Deepshika Sharma
  • ఫ్లాట్ యజమానిని కుక్కర్ తో కొట్టి చంపిన దంపతులు
  • నాలుగు నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో కిరాయిదారులను నిలదీసిన యజమాని 
  • ఆగ్రహంతో యజమానిపై దాడి చేసిన కిరాయిదారులు
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటి అద్దె బకాయి అడిగిన యజమానిని అద్దెకున్న దంపతులు దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని ఓ సూట్‌కేస్‌ లో కుక్కి బయట పడేసేందుకు వెళుతూ పట్టుబడ్డారు. పనిమనిషి, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘజియాబాద్‌లోని మోదీనగర్ ప్రాంతంలోని ఔరా చిమేరా రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో దీప్షికా శర్మ, ఉమేశ్ శర్మ దంపతులు నివాసం ఉంటున్నారు. ఇదే కాంప్లెక్స్ లో వారికి మరో ఫ్లాట్ కూడా ఉంది. ఈ ఫ్లాట్ ను అజయ్ గుప్తా, ఆకృతి గుప్తా దంపతులకు అద్దెకు ఇచ్చారు.

అయితే, నాలుగు నెలలుగా గుప్తా దంపతులు అద్దె చెల్లించడం లేదు. ఈ బకాయిలు వసూలు చేసుకోవడానికి దీప్షికా శర్మ బుధవారం గుప్తా దంపతులు ఉంటున్న ఫ్లాట్ కు వెళ్లింది. ఆ తర్వాత గంటలు గడిచినా దీప్షిక తిరిగి రాలేదు. దీంతో దీప్షిక ఇంట్లో పనిమనిషి మీనా తన యజమానురాలిని వెతుక్కుంటూ గుప్తా దంపతుల ఫ్లాట్ కు వెళ్లింది. అయితే, దీప్షిక తమ దగ్గరికి రాలేదని వారు చెప్పారు. అయితే వారి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో మీనా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించింది. అందులో గుప్తా దంపతుల ఫ్లాట్ లోకి దీప్షిక వెళ్లడం కనిపించింది. కానీ బయటకు వచ్చిన జాడలు కనిపించలేదు.

దీంతో మీనా పోలీసులకు సమాచారం అందించింది. ఇంతలో గుప్తా దంపతులు ఓ పెద్ద సూట్ కేసు మోసుకుంటూ బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పటికే వారిపై అనుమానంతో ఉన్న మీనా వెంటనే వారిని అడ్డుకుంది. తన యజమానురాలు కనిపించే వరకూ ఎక్కడికీ వెళ్లడానికి వీళ్లేదని తేల్చి చెప్పింది. పోలీసులు అక్కడికి చేరుకుని గుప్తా దంపతుల ఫ్లాట్ లో సోదా చేయగా.. సూట్ కేసులో దీప్షిక మృతదేహం బయటపడింది. గుప్తా దంపతులను ప్రశ్నించగా.. అద్దె విషయంలో గొడవ జరగడంతో ఆగ్రహం పట్టలేక కుక్కర్ తో దీప్షిక తలపై కొట్టి, ఆపై చున్నీతో ఉరివేసి చంపినట్లు వెల్లడించారు. దీంతో గుప్తా దంపతులను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.
Ghaziabad murder
rent dispute
Uttar Pradesh crime
Deepshika Sharma
Ajay Gupta
Akriti Gupta
Modinagar
Chirmera residency
crime news
India crime

More Telugu News