Overthinking: అతిగా ఆలోచించడాన్ని ఇలా మానుకోవచ్చు.. ధ్యానం బెస్ట్

Stop Overthinking with Meditation and Mindfulness
  • అతిగా ఆలోచించడం వల్ల అనర్థాలే తప్ప ఉపయోగం లేదంటున్న నిపుణులు
  • మానసిక ఒత్తిడికి తద్వారా అనారోగ్యాలకు కారణమవుతుందని వార్నింగ్
  • మెదడును ఖాళీగా ఉంచొద్దని సూచన
‘ఈవిల్స్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్’ అనేది ముమ్మాటికీ నిజమని అతిగా ఆలోచించేవాళ్ల అనుభవం.. మెదడు ఏ కాస్త ఖాళీగా ఉన్నా ఏవేవో ఆలోచనలు చుట్టుముడుతుంటాయి. ఫలితంగా చికాకు కలుగుతుందని, మానసిక ప్రశాంతత కరవై, నిద్రకు దూరమై ఇబ్బంది పడుతుంటారని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. అది మానసిక ఒత్తిడికి తద్వారా అనారోగ్యాలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. విషయం ఏదైనా సరే అతిగా ఆలోచించడం వల్ల ఉపయోగం లేకపోగా అనర్థాలే ఎదురవుతాయని అంటున్నారు. కోపం, ఒత్తిడి పెరిగి మానసికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. చుట్టుముట్టే ఆలోచనలను అడ్డుకోవడానికి నిపుణులు సూచిస్తున్న పలు పరిష్కార మార్గాలు ఇవిగో..

ఆలోచనలను మార్చుకోవడం..
ప్రతీ చిన్న విషయాన్నీ లోతుగా ఆలోచించే మెదడుకు సరైన సూచనలు మీరే ఇవ్వాలి. ఇప్పుడు ఈ విషయం గురించి ఆలోచించదలుచుకోలేదని మీకు మీరే కాస్త గట్టిగా చెప్పుకోవాలి. ఆలోచనలను వేరే విషయాలవైపు మార్చుకోవాలి.

24 గంటల్లో నిర్ణయం..
మీ మదిని వేధిస్తున్న విషయానికి సంబంధించి 24 గంటల్లో నిర్ణయం తీసుకోవడం మంచి మార్గం. అలా కుదరని పక్షంలో దానిని వాయిదా వేసి ఇతరత్రా పనుల్లో నిమగ్నం కావాలి. ఏ విషయమైనా సరే నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేయడం వల్ల దానికి సంబంధించిన ఆలోచనలు మిమ్మల్ని పట్టిపీడిస్తుంటాయి.

వాస్తవమా? ఊహనా? 
ఆలోచనలకు స్పష్టతనివ్వడం ద్వారా అతిగా ఆలోచించాల్సిన అవసరం తప్పుతుంది. ఏ విషయమైనా సరే అందులో వాస్తవం ఎంత, ఊహ ఎంత అనే దానిపై దృష్టి సారిస్తే దాదాపు 80 శాతం స్పష్టత వస్తుంది. వాస్తవమైతే సరే.. అలాకాని పక్షంలో దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే ఉండదు.

ఏదో ఒక పని కల్పించుకోండి..
ఆలోచనలు చుట్టుముట్టినప్పుడు వెంటనే ఏదైనా పని కల్పించుకుని దానిపైనే దృష్టి పెట్టండి. దీంతో నెమ్మదిగా అతి ఆలోచనలు తగ్గిపోతాయి.

ఆలోచనలను పేపర్ పై పెట్టండి..
మెదడును తొలిచేస్తున్న ఆలోచనలను పేపర్ పై రాస్తే సగం ఒత్తిడి తగ్గిపోతుంది. వాటిని ఒకటికి రెండు సార్లు చదివితే మీ సమయాన్ని వృథా చేస్తున్న దొంగ దొరికిపోతుంది.

ధ్యానంతో ఆలోచనలకు కళ్లెం..
శ్వాస మీద ధ్యాస ఉంచి కాసేపు ధ్యానం చేయడం వల్ల ఆలోచనలను దూరంపెట్టొచ్చు. మెదడు, మనసు ప్రశాంతంగా ఉంటుంది.

ప్రతికూల పరిస్థితులు..
ఫలితంపై అతిగా ఆలోచించడం వల్ల అనవసరమైన ఆదుర్దా తప్ప ప్రయోజనం ఉండదు. ఫలితం ప్రతికూలంగా వస్తుందని ముందే మీరు నిర్ణయించుకుంటే 70 శాతం ఒత్తిడి తగ్గిపోతుంది.

మెదడుకు పని చెప్పండి..
ఖాళీగా ఉన్న మెదడులోకి రకరకాల ఆలోచనలు వద్దన్నా వస్తూనే ఉంటాయి. అందుకే మీ మెదడుకు పని చెప్పండి. సంగీతం వినడమో, నచ్చిన సినిమాను చూడటమో చేస్తూ ఉంటే ఆలోచనలకు బ్రేక్ పడుతుంది.

మిత్రుడితో పంచుకోండి..
ఆలోచనలు వేధిస్తుంటే నమ్మకమైన మిత్రుడితో పంచుకోండి. దీంతో దాదాపు 50 శాతం ఒత్తిడి తగ్గిపోతుంది. మీ సన్నిహితులు, మీ క్షేమం కోరేవారి సలహాలు, సూచనలు పాటిస్తే మంచిది.
Overthinking
Anxiety
Stress relief
Mental health
Meditation
Mindfulness
Decision making
Problem solving
Negative thoughts
Positive thinking

More Telugu News