Chandrababu: నిధులు లేకున్నా అద్భుతాలు చేయొచ్చు.. కలెక్టర్ల వినూత్న పథకాలకు సీఎం చంద్రబాబు ఫిదా

Chandrababu Praises Innovative Schemes of AP Collectors
  • అల్లూరి జిల్లాలో విద్యార్థుల కోసం 'సూపర్ 50' కార్యక్రమం
  • పార్వతీపురం మన్యం జిల్లా 'ముస్తాబు'కు సీఎం ప్రశంసలు
  • ఏలూరులో నాటుసారా తయారీదారుల కోసం 'ప్రాజెక్టు మార్పు'
  • విజయవంతమైన ఈ విధానాలను రాష్ట్రమంతా అమలు చేయాలని ఆదేశం
  • వినూత్న ఆలోచనలతో అధికారులు ముందుకొస్తే ప్రోత్సాహం ఉంటుందన్న సీఎం
జిల్లా కలెక్టర్లు తమ పరిధిలో అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలపై సీఎం చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. అల్లూరి, పార్వతీపురం మన్యం, ఏలూరు జిల్లాల కలెక్టర్లు అమలు చేస్తున్న పథకాలను ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి విజయవంతమైన విధానాలను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ప్రవేశపెట్టిన 'ముస్తాబు' కార్యక్రమం తనను ఎంతగానో ఆకర్షించిందని ముఖ్యమంత్రి అన్నారు. నిధులు లేకుండానే అద్భుతాలు చేయవచ్చనడానికి ఈ కార్యక్రమమే నిదర్శనమని కొనియాడారు. విద్యార్థుల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించే ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని 79 లక్షల మంది విద్యార్థులకు చేరేలా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో అమలు చేయాలని సూచించారు.

అలాగే ఏలూరు జిల్లాలో నాటుసారా తయారీదారుల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు కలెక్టర్ వెట్రిసెల్వి అమలు చేస్తున్న 'ప్రాజెక్టు మార్పు' కార్యక్రమాన్ని సీఎం అభినందించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 140 గ్రామాల్లో స్పష్టమైన మార్పు కనిపించిందని, వారిని మైక్రో ఎంట్రప్రెన్యూర్లుగా తీర్చిదిద్దుతున్నామని కలెక్టర్ వివరించారు.

అల్లూరి జిల్లాలో పదో తరగతి విద్యార్థుల కోసం కలెక్టర్ దినేశ్‌ కుమార్ అమలు చేస్తున్న 'సూపర్ 50 ఇన్స్పిరేషన్ ఇంజిన్ ఆఫ్ నిర్మాణ్' కార్యక్రమం ద్వారా ఇప్పటికే 90 వేల మంది గిరిజన విద్యార్థులు లబ్ధి పొందారని తెలుసుకుని సంతోషం వ్యక్తం చేశారు. కుప్పంలో ప్రారంభించిన 'విలువల బడి' కాన్సెప్టును ప్రస్తావిస్తూ, విద్యార్థులకు నాలెడ్జ్‌తో పాటు విలువలు కూడా చాలా ముఖ్యమని సీఎం అన్నారు. టెక్నాలజీని వాడుకుంటూ వినూత్న ఆలోచనలతో ప్రజలకు మేలు చేయాలని, విద్యాశాఖలో మంచి మార్పు తీసుకురావాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.
Chandrababu
AP Collectors
Andhra Pradesh
Innovative schemes
Parvathipuram Manyam
Alluri district
Eluru district
Project Marpu
Mustaabu program
Education

More Telugu News