Delhi Traffic Police: పాత కారులో వస్తే 20 వేలు ఫైన్.. ఢిల్లీ బార్డర్ లో ట్రాఫిక్ పోలీసుల ఆంక్షలు

20000 Fine for Old Cars at Delhi Border
  • కాలుష్య నియంత్రణ కోసం కఠినంగా వ్యవహరిస్తున్న అధికారులు
  • బార్డర్ నుంచే పాత వాహనాలను వెనక్కి పంపిస్తున్న వైనం
  • కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి తాము మూల్యం చెల్లించాల్సి వస్తోందంటున్న వాహనదారులు
దేశ రాజధానిలో కాలుష్య నియంత్రణకు అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ముఖ్యంగా పాత వాహనాల విషయంలో ఎలాంటి మినహాయింపులకు తావివ్వడం లేదు. ఢిల్లీ బార్డర్ తో పాటు సిటీలోనూ వివిధ ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. బీఎస్ 4 ఆపై ప్రమాణాలు ఉన్న వాహనాలకు తప్ప మిగతా వాహనాలను ఢిల్లీలోకి అనుమతించడం లేదు. పాత వాహనాలతో వచ్చే వారికి భారీ మొత్తంలో జరిమానాలు విధిస్తున్నారు. బీఎస్ 3 కార్లలో వచ్చే వారికి రూ.20 వేలు ఫైన్ వేస్తామని హెచ్చరిస్తున్నారు.

జరిమానా తప్పించుకోవాలంటే బార్డర్ నుంచే వెనక్కి వెళ్లిపోవాలని ఆదేశిస్తున్నారు. ఢిల్లీలోని పాత వాహనాల యజమానులకూ ట్రాఫిక్ పోలీసులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కాలుష్య నియంత్రణకు సహకరించకుండా పాత వాహనాలతో రోడ్డెక్కితే 20 వేలు ఫైన్ కట్టాల్సి వస్తుందని స్పష్టం చేశారు. నగరం నలుమూలలా చెక్ పాయింట్లు ఏర్పాటు చేసి తనిఖీలు జరుపుతున్నామని, తప్పించుకునే అవకాశమే లేదని పేర్కొన్నారు.

వైఫల్యం కేంద్రానిది.. మూల్యం మేం చెల్లించాలా?
ట్రాఫిక్ పోలీసుల తనిఖీలతో ఢిల్లీ, ఫరీదాబాద్ వాసులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాలుష్య నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి తాము మూల్యం చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు. ఢిల్లీలో అమలులోకి వచ్చిన తాజా నిబంధనల గురించి అవగాహన లేకుండా పాత కారుతో నగరానికి వచ్చిన ఫరీదాబాద్ వాసి ఒకరు స్పందిస్తూ.. ట్రాఫిక్ పోలీసులు కార్లను మాత్రమే తనిఖీ చేస్తున్నారని చెప్పారు. తాము రోడ్ ట్యాక్స్ సహా ఇతరత్రా పన్నులన్నీ చెల్లించామని ఆయన గుర్తుచేశారు. కార్లను తనిఖీ చేస్తున్న పోలీసులు ప్రజా రవాణా వ్యవస్థ విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా ఉంటున్నారని, బస్సులను తనిఖీ చేయడం లేదని ఆరోపించారు.
Delhi Traffic Police
Delhi
Traffic rules
Pollution control
BS3 vehicles
BS4 vehicles
Vehicle fine
Faridabad
Vehicle check posts

More Telugu News