Imran Khan: ఇమ్రాన్ ఖాన్ చెల్లెళ్లపై యాంటీ టెర్రరిస్ట్ యాక్ట్ కింద కేసు

Imran Khan Sisters Face Anti Terrorism Charges in Pakistan
  • అడియాలా జైలు ముందు ఆందోళన చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు
  • ఇమ్రాన్ చెల్లెళ్లతో పాటు మొత్తం 50 మందిపై కేసు పెట్టిన పోలీసులు
  • మాజీ ప్రధానితో ములాఖాత్ కు అధికారులు నిరాకరించడంతో పీటీఐ నేతల ఆందోళన
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ ను అవినీతి కేసులో జైలుకు పంపిన ప్రభుత్వం.. ఆయన సోదరీమణులపై కూడా యాంటీ టెర్రరిస్ట్ యాక్ట్ కింద కేసు నమోదు చేసింది. ఇమ్రాన్ ను కలుసుకోవడానికి అధికారులు నిరాకరించడంతో ఆయన సోదరీమణులు అడియాలా జైలు ముందు ఆందోళన చేయగా పోలీసులు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారితో పాటు పీటీఐ సీనియర్ నేతలు, పార్టీ కార్యకర్తలు మొత్తం 50 మందిపై కేసు నమోదు చేసినట్లు రావల్పిండి పోలీసులు తెలిపారు. దీంతో పాటు ఎఫ్ఐఆర్ లో పాకిస్థాన్ పీనల్ కోడ్ లోని సెక్షన్ 120బి (నేరపూరిత కుట్ర) ఆరోపణలు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

అసలు ఏం జరిగిందంటే..
ఇటీవల ఇమ్రాన్ ఖాన్ జైలులో చనిపోయారని ప్రచారం జరిగింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమ నేతను చూపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఇమ్రాన్ ఖాన్ ను ఉంచిన రావల్పిండిలోని అడియాలా జైలు ముందు ఆందోళనకు దిగారు. ఇమ్రాన్ సోదరీమణులు అలీమా ఖాన్, నోరీన్ నియాజీలతో పాటు పీటీఐ పార్టీ కీలక నేతలు, పలువురు మద్దతుదారులతో కలిసి జైలు ముందు బైఠాయించారు. జైలు అధికారులను అడ్డుకున్నారు. అడియాలా జైలులో హైప్రొఫైల్ ఖైదీలు ఉండటంతో ఆ ప్రాంతాన్ని ప్రభుత్వం సెన్సిటివ్ ఏరియాగా, సెక్యూరిటీ జోన్ గా ప్రభుత్వం ప్రకటించింది. అక్కడ 144 సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొంది. అలాంటి చోట బైఠాయించి ఆందోళన చేసిన ఇమ్రాన్ సోదరీమణులు, పీటీఐ నేతలపై యాంటీ టెర్రరిస్ట్ యాక్ట్ కింద ప్రభుత్వం కేసులు నమోదు చేసింది.
Imran Khan
Pakistan
PTI
Anti-Terrorist Act
Adiala Jail
Rawalpindi Police
Aleema Khan
Naureen Niazi
Corruption Case
Political Protest

More Telugu News