Ashwini Vaishnaw: ఇక రైళ్లలో అధిక లగేజీపై ఛార్జీలు వడ్డన

Ashwini Vaishnaw Excess Luggage Charges in Trains to be Levied
  • రైళ్లలో పరిమితికి మించి లగేజీ తీసుకెళ్తే అదనపు రుసుములు
  • పార్లమెంటులో స్పష్టతనిచ్చిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
  • వివిధ తరగతులకు వేర్వేరుగా లగేజీ ఉచిత పరిమితులు
  • నిర్ణీత సైజు మించితే లగేజీని బ్రేక్‌వ్యాన్‌లో తరలించాలని ఆదేశం
రైలు ప్రయాణాల్లో పరిమితికి మించి లగేజీ తీసుకెళ్లే వారిపై అదనపు రుసుము విధిస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. విమానాశ్రయాల్లో మాదిరిగా రైళ్లలోనూ లగేజీపై నిబంధనలు అమలు చేస్తారా అని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ప్రయాణించే తరగతిని బట్టి ప్రతి ప్రయాణికుడు తమ వెంట ఉచితంగా తీసుకెళ్లగలిగే లగేజీపై పరిమితి ఉందని మంత్రి వివరించారు.
 
వివిధ తరగతుల వారీగా ఉచిత లగేజీ పరిమితులను మంత్రి వెల్లడించారు. సెకండ్ క్లాస్‌లో 35 కేజీలు, స్లీపర్ క్లాస్‌లో 40 కేజీల వరకు ఉచితంగా తీసుకెళ్లవచ్చు. థర్డ్ ఏసీ, ఏసీ చైర్ కార్లలో కూడా 40 కేజీల వరకు ఉచిత అనుమతి ఉంది. ఏసీ 2-టైర్, ఫస్ట్ క్లాస్‌లో 50 కేజీల వరకు, ఏసీ ఫస్ట్ క్లాస్‌లో 70 కేజీల వరకు లగేజీని ఉచితంగా అనుమతిస్తారు.
 
ఉచిత పరిమితితో పాటు, అదనపు ఛార్జీలు చెల్లించి తీసుకెళ్లగల గరిష్ఠ లగేజీ పరిమితులను కూడా మంత్రి తెలిపారు. స్లీపర్ క్లాస్‌లో గరిష్ఠంగా 80 కేజీలు, ఏసీ ఫస్ట్ క్లాస్‌లో 150 కేజీల వరకు లగేజీని తీసుకెళ్లవచ్చు. ఈ గరిష్ఠ పరిమితిలో ఉచితంగా తీసుకెళ్లే లగేజీ కూడా కలిపి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఉచిత పరిమితిని దాటిన లగేజీని ప్రయాణికులు ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
 
లగేజీ బరువుతో పాటు, దాని పరిమాణంపై కూడా నిబంధనలు ఉన్నాయని మంత్రి తెలిపారు. 100 సెంటీ మీటర్లు, 60 సెంటీమీటర్లు, 25 సెంటీమీటర్ల కొలతలు మించని సూట్‌కేసులు, ట్రంకు పెట్టెలను మాత్రమే కంపార్ట్‌మెంట్‌లోకి అనుమతిస్తారు. ఈ సైజు కంటే పెద్దగా ఉన్నవాటిని తప్పనిసరిగా బ్రేక్‌వ్యాన్ లేదా పార్సిల్ వ్యాన్‌లో పెట్టి తరలించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
 
Ashwini Vaishnaw
Indian Railways
railway luggage rules
luggage charges
excess baggage
train travel
Vemireddy Prabhakar Reddy
railway ministry
free luggage allowance

More Telugu News