Hyderabad: భాగ్యనగరంలో డేంజర్ బెల్స్.. 220కి చేరిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్

Hyderabad Air Quality Index reaches dangerous levels
  • హైదరాబాద్‌లో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం
  • వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని వైద్యుల హెచ్చరిక
  • పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత అత్యంత క్షిణించిందని సీపీసీబీ వెల్లడి
హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) ఏకంగా 220 స్థాయికి చేరుకోవడంతో భాగ్యనగరం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. గాలిలో పీఎం 10, పీఎం 2.5 వంటి ప్రమాదకర ధూళి కణాల పరిమాణం విపరీతంగా పెరిగిపోవడంతో వృద్ధులు, చిన్నారులు, ఆస్తమా రోగులు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సాధారణంగా గాలి నాణ్యత సూచిక 50 లోపు ఉంటే ఆరోగ్యకరమని, 100 వరకు ఉంటే ఫర్వాలేదని భావిస్తారు. కానీ ఇప్పుడు 200 దాటడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నగరంలోని బొల్లారం, పటాన్‌చెరు, హెచ్‌సీయూ, సోమాజిగూడ, జూపార్కు వంటి ప్రాంతాల్లో కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సనత్‌నగర్, మలక్‌పేట, నాచారం, కోకాపేట వంటి మరికొన్ని ప్రాంతాల్లో గాలి నాణ్యత సంతృప్త స్థాయి నుంచి ప్రమాదకర స్థితికి చేరుకుంటోందని హెచ్చరించింది.

పారిశ్రామిక వాడల నుంచి వెలువడే పొగ, వాహనాల రద్దీ వల్లే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని జేఎన్టీయూ పర్యావరణ విభాగం అధికారులు చెబుతున్నారు. రానున్న చలికాలంలో కాలుష్య తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో, వృద్ధులు, చిన్నారులు వీలైనంత వరకు ఇళ్లకే పరిమితం కావాలని, అత్యవసరమైతే మాస్కులు ధరించి బయటకు వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు.

అయితే, ఈ ఆందోళనలపై కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులు భిన్నంగా స్పందించారు. నగరంలో గాలి నాణ్యత సంతృప్తికరంగానే ఉందని, కొన్ని థర్డ్ పార్టీ యాప్‌లు కాలుష్య సూచికలను వాస్తవానికి మించి ఎక్కువగా చూపిస్తున్నాయని వారు పేర్కొన్నారు.
Hyderabad
Air Quality Index
AQI
Pollution
Air pollution
CPCB
JNTU
Telangana
Bollaram
Patancheru

More Telugu News