Chandrababu Naidu: హాస్టళ్లలో విద్యార్థులకు ఏం జరిగినా ముందు సస్పెండ్ చేస్తా: ఏపీ సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Warns Suspension for Hostel Issues in AP
  • విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం చంద్రబాబు వార్నింగ్
  • సంక్షేమ హాస్టళ్లలో కలెక్టర్లు నిద్ర చేయాలన్న సీఎం 
  • సూపర్ సిక్స్ పథకాల అమలుకు క్యాలెండర్ సిద్ధం చేయాలని ఆదేశం
సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు ఎలాంటి హాని జరిగినా సంబంధిత అధికారులను ముందుగా సస్పెండ్ చేసి, ఆ తర్వాతే మిగతా విషయాలు మాట్లాడతానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా హెచ్చరించారు. అమరావతిలో మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి ఆయన జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాల అమలుపై అధికారులకు కీలక దిశానిర్దేశం చేశారు.

జిల్లా కలెక్టర్లు స్వయంగా సంక్షేమ హాస్టళ్లలో నిద్ర చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. విద్యార్థుల బాగోగులు ప్రత్యక్షంగా తెలుసుకోవాలని, వారి ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హాస్టల్ విద్యార్థులకు తప్పనిసరిగా వైద్య పరీక్షలు నిర్వహించి, రక్తహీనత వంటి సమస్యలను గుర్తించాలన్నారు. 7 నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు యోగా, ధ్యానం వంటివి ప్రవేశపెట్టాలని, పాఠశాలల్లో క్రీడలను తప్పనిసరి చేయాలని స్పష్టం చేశారు.

సూపర్ సిక్స్ సహా ఇతర సంక్షేమ పథకాల అమలుకు ఒక స్పష్టమైన క్యాలెండర్ రూపొందించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో చేపట్టిన "ముస్తాబు" కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని సూచించారు. గిరిజన విద్యార్థులు ఐఐటీ, ఎన్ఐటీ వంటి ఉన్నత విద్యాసంస్థల్లో రాణించేలా ప్రోత్సహించాలని, వారి కెరీర్‌కు సరైన ప్రణాళికలు రూపొందిస్తే విప్లవాత్మక మార్పులు వస్తాయని అభిప్రాయపడ్డారు.

గిరిజన ప్రాంతాల్లో ఆర్గానిక్ ఉత్పత్తుల ప్రాసెసింగ్ కోసం ఫుడ్ పార్కులు ఏర్పాటు చేయాలని, పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు గిరిజన కార్పొరేషన్ ద్వారా హోటళ్లు నిర్మించాలని సూచించారు. అనకాపల్లి జిల్లాలో ఫుడ్ పార్కు కోసం 250 ఎకరాలు కేటాయిస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. పీ4 పద్ధతిలో సంక్షేమ హాస్టళ్లను దత్తత తీసుకునే అంశాన్ని పరిశీలించాలని కలెక్టర్లకు సూచించారు. 
Chandrababu Naidu
AP CM
Andhra Pradesh
Welfare Hostels
Student Safety
District Collectors
Super Six Schemes
Tribal Students
Food Parks
Education

More Telugu News