Chiranjeevi: రేపు జూబ్లీహిల్స్ లో చిరంజీవి అభిమానుల సమావేశం... ఎందుకంటే...!

Chiranjeevi Fans Meeting in Jubilee Hills for Movie Promotion
  • 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం విజయం కోసం ఫ్యాన్స్ సన్నాహాలు
  • రేపు హైదరాబాద్‌లో అఖిల భారత చిరంజీవి యువత భేటీ
  • సినిమాను భారీ హిట్ చేసేందుకు వ్యూహరచనపై చర్చ
  • జనవరి 12న విడుదల కానున్న మెగాస్టార్ కొత్త చిత్రం
  • సోషల్ మీడియా ద్వారా సమావేశ వివరాలు వెల్లడి
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాను భారీ విజయం దిశగా నడిపించేందుకు అభిమాన సంఘం కార్యాచరణకు సిద్ధమైంది. ఇందులో భాగంగా, అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో రేపు హైదరాబాద్‌లో ఒక కీలక సమావేశం జరగనుంది. సినిమా ప్రమోషన్, విడుదల సమయంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈ భేటీలో చర్చించనున్నారు.

ఈ సమావేశం రేపు (డిసెంబరు 18) ఉదయం 9:09 గంటలకు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ప్రారంభం కానున్నట్లు అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు రవణం స్వామినాయుడు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. జనవరి 12న విడుదల కానున్న ఈ సినిమాను ప్రతి ఒక్క ప్రేక్షకుడి వద్దకు తీసుకెళ్లి, ఘన విజయాన్ని అందించాలని అభిమానులకు ఆయన పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత తరఫున ఒక ప్రకటన విడుదల చేశారు. "ప్రేక్షకులకు వినోదాన్ని అందించడంలో చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటల్లో ఆయన ఎంతో హుషారుగా, చార్మింగ్‌గా కనిపించి ఆకట్టుకున్నారు. అభిమానులమంతా కలిసికట్టుగా పనిచేసి ఈ సినిమాకు భారీ విజయాన్ని అందిద్దాం" అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో అన్ని విషయాలు చర్చించి, సినిమా విజయం కోసం పటిష్టమైన ప్రణాళికను సిద్ధం చేయనున్నట్లు తెలిపారు.

చిరంజీవి ప్రస్తుతం యువ దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Chiranjeevi
Mana Shankara Varaprasad Garu
Anil Ravipudi
Telugu Movie
Movie Promotion
Jubilee Hills
Fan Meeting
Sankranti Release
Ravanam Swaminaidu
Akhila Bharata Chiranjeevi Yuva

More Telugu News