అది మీ కుటుంబం ఆస్తి కాదు, నెహ్రూ లేఖలు వెనక్కివ్వండి: సోనియా గాంధీకి కేంద్రం సూచన

  • నెహ్రూ లేఖలు, కార్టూన్లు సోనియా వ్యక్తిగత ఆస్తులు కావన్న గజేంద్రసింగ్ షెకావత్
  • 2008లో సోనియా గాంధీ ఆ లేఖలను తీసుకున్నారన్న కేంద్రం
  • నెహ్రూ లేఖలు, కార్టూన్లు ఎందుకు తిరిగివ్వడం లేదని సోనియాకు ప్రశ్న
భారత తొలి ప్రధాని నెహ్రూకు సంబంధించిన లేఖలు, కార్టూన్లు సోనియా గాంధీ వ్యక్తిగత ఆస్తులు కావని, అవి దేశ ఆస్తి కాబట్టి వాటిని తిరిగి అప్పగించాలని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ డిమాండ్ చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య వివిధ అంశాలపై వాడి వేడిగా చర్చ జరుగుతోంది.

ఈ క్రమంలో జవహర్ లాల్ నెహ్రూ లేఖలకు సంబంధించి బుధవారం బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల మధ్య వాగ్యుద్ధం జరిగింది. నెహ్రూ లేఖలు తిరిగి ఇచ్చేయాలని, అవి గాంధీ కుటుంబం ఆస్తులు కావని సాంస్కృతిక శాఖ సోనియా గాంధీకి స్పష్టం చేసింది.

అంతకుముందు, నెహ్రూకు సంబంధించిన లేఖలు ఎక్కడున్నాయని, వాటి ఆచూకీ లేకుండా చేసినందుకు ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ నేతల డిమాండ్‌పై కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పందించారు. ప్రైమ్ మినిస్టర్ మ్యూజియం, లైబ్రరీ నుంచి నెహ్రూ లేఖలు అదృశ్యం కాలేదని స్పష్టం చేశారు. 2008 ఆగస్ట్ 29వ తేదీతో కూడిన ఉత్తరంలో సోనియా గాంధీ ప్రతినిధి ఎంవీ రాజన్ నెహ్రూకు సంబంధించిన వ్యక్తిగత ఉత్తరాలను, నోట్స్‌ను ఆమె తిరిగి తీసుకునేందుకు అనుమతించాలని కోరారని తెలిపారు.

ఈ లేఖ ఆధారంగా నెహ్రూ వ్యక్తిగత పత్రికల్లో ముద్రితమైన 51 కార్టూన్లను 2008లో సోనియా గాంధీకి అప్పగించారని అర్థమవుతోందని తెలిపారు. సోనియా కార్యాలయం నుంచి వాటిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు పీఎంఎంఎల్ ప్రయత్నిస్తోంది. ఈ విషయమై ఈ సంవత్సరం రెండుసార్లు సోనియా గాంధీకి లేఖలు రాశామని అన్నారు. ఆ లేఖలు అదశ్యం కాలేదని, అవి ఎవరి దగ్గర ఉన్నాయో తమకు తెలుసని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఆ లేఖలను అప్పగించాలని ఆయన సోనియాకు విజ్ఞప్తి చేశారు.

నెహ్రూ లేఖలు, కార్టూన్లను ఎందుకు తిరిగివ్వడం లేదో దేశ ప్రజలకు చెప్పాలని సోనియా గాంధీని కేంద్ర మంత్రి 'ఎక్స్' వేదికగా ప్రశ్నించారు. వాటిని మీ వద్ద ఎందుకు అట్టిపెట్టుకున్నారని, అందులో ఉన్న రహస్యాలేమిటని ప్రశ్నించారు. ఎంతో ముఖ్యమైన చారిత్రక డాక్యుమెంట్లు ఇంకా ప్రజలకు ఎందుకు అందుబాటులో లేకుండా పోయాయని అన్నారు. అవి మీ కుటుంబ వ్యక్తిగత పత్రికలు కాదని తేల్చిచెప్పారు.


More Telugu News