Nitish Kumar: ఆ రూ.10 వేలు తిరిగివ్వాలంటే, మా ఓటు మాకు తిరిగివ్వండి: బీహార్ పురుషుల ఆగ్రహం

Nitish Kumar Bihar Men Demand Vote Back if Asked to Return Money
  • మహిళా రోజ్ గార్ యోజన పథకం కింద రూ.10 వేలు జమ చేసిన ప్రభుత్వం
  • సాంకేతిక లోపం కారణంగా ఓ గ్రామంలో పురుషుల ఖాతాల్లో కూడా జమ
  • ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని కోరుతున్న అధికారులు
  • ఆ డబ్బు అడిగితే, మా ఓటు మాకివ్వాలంటున్న గ్రామస్థులు
అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీహార్ ప్రభుత్వం 'ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన' పథకంలో భాగంగా మహిళలకు ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున రాష్ట్రంలోని 75 లక్షల మంది మహిళల బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ పథకంలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా కొంతమంది పురుషుల ఖాతాల్లోకి కూడా పొరపాటున రూ.10,000 జమ అయ్యాయి. ఈ నేపథ్యంలో, ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని అధికారులు ఆయా పురుషులను కోరుతున్నారు. అయితే డబ్బు తిరిగివ్వాలంటే మా ఓటు మాకివ్వాలని గ్రామస్తులు అంటున్నారు.

పథకం అమలులో భాగంగా ప్రభుత్వం మహిళల ఖాతాలకు నేరుగా నగదు బదిలీ చేసింది. ఈ క్రమంలో దర్భంగా జిల్లాలోని అహియారి గ్రామంలో పలువురు పురుషుల ఖాతాల్లోకి కూడా నగదు జమ అయింది. పొరపాటును గుర్తించిన అధికారులు, ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని కోరుతూ సంబంధిత పురుషులకు నోటీసులు జారీ చేశారు.

అయితే, ప్రభుత్వం పొరపాటున జమ చేసిన డబ్బును ఖర్చు చేసినట్లు పురుషులు చెబుతున్నారని అధికారులు తెలిపారు. కొందరు ఆ డబ్బుతో జీవనోపాధి కోసం బాతులు, మేకలు కొనుగోలు చేసినట్లు చెప్పగా, మరికొందరు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించలేమని చెబుతున్నారు. ఇంకొందరు ఆ డబ్బును ఖర్చు చేశామని, అంతమొత్తం తమ వద్ద లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో, తమ ఖాతాల్లో పొరపాటున జమ అయిన నగదును మాఫీ చేయాలని అహియారి గ్రామస్తులు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రభుత్వం తమ ఖాతాల్లోకి డబ్బు బదిలీ చేసిందని, తాము ఓట్లు వేశామని, ఇప్పుడు ఆ డబ్బును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తోందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "మేము ఓటు వేశాము, వారు గెలిచారు, ఇప్పుడు వారు డబ్బును తిరిగి అడుగుతున్నారు" అని ఐదుగురు పిల్లలు ఉన్న రామ్ వాపోయాడు. దీపావళి, ఛత్ పూజల సమయంలో బట్టలు మరియు అవసరమైన గృహోపకరణాల కోసం తాను రూ. 10,000 ఖర్చు చేశానని ఆయన తెలిపాడు.

డబ్బులు తిరిగి ఇవ్వాలంటే ప్రభుత్వం తమ ఓట్లు తిరిగివ్వాలని స్థానిక మహిళ ప్రమీలా దేవి మండిపడ్డారు. ఇదిలా ఉండగా, సాంకేతిక తప్పిదం కారణంగా నగదు జమ కావడంతో ఏడుగురు గ్రామస్తులు డబ్బును తిరిగి ఇచ్చారని అధికారులు తెలిపారు.
Nitish Kumar
Bihar
Mukhyamantri Mahila Rojgar Yojana
Bihar government scheme

More Telugu News