Pappu Yadav: ఐపీఎల్‌లోకి ఎంపీ పప్పు యాదవ్ కుమారుడు... భావోద్వేగ ట్వీట్ చేసిన ఎంపీ

Pappu Yadavs Son Sarthak Ranjan Selected for IPL
  • ఐపీఎల్ వేలంలో ఎంపీ పప్పు యాదవ్ కుమారుడు సార్థక్ రంజన్
  • రూ. 30 లక్షలకు కొనుగోలు చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్
  • మంచి గుర్తింపు తెచ్చుకో అంటూ పప్పు యాదవ్ భావోద్వేగం
ఐపీఎల్ 2026 సీజన్ కోసం అబుదాబిలో జరిగిన మినీ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) దూకుడు ప్రదర్శించింది. అత్యధికంగా రూ. 64.30 కోట్ల పర్సుతో బరిలోకి దిగిన కేకేఆర్, మొత్తం 13 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఈ కొనుగోళ్లలో స్వతంత్ర ఎంపీ రాజేశ్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ కుమారుడు సార్థక్ రంజన్ పేరు అందరి దృష్టిని ఆకర్షించింది.

ఢిల్లీ తరఫున దేశవాళీ క్రికెట్ ఆడే సార్థక్‌ను కేకేఆర్ రూ. 30 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్‌కు తన కుమారుడు ఎంపికవడంపై పప్పు యాదవ్ సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు. "అభినందనలు బేటా! మనస్ఫూర్తిగా ఆడు. నీ ప్రతిభతో నీకంటూ ఓ గుర్తింపు తెచ్చుకో. నీ కోరికలు నెరవేర్చుకో. ఇకపై సార్థక్ పేరుతోనే మా గుర్తింపు ఉంటుంది" అని ఎక్స్‌ లో భావోద్వేగ పోస్ట్ చేశారు.

సార్థక్ రంజన్ ఇప్పటివరకు ఢిల్లీ తరఫున 2 ఫస్ట్-క్లాస్, 4 లిస్ట్-ఏ, 5 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఫస్ట్-క్లాస్‌లో 28 పరుగులు, లిస్ట్-ఏలో 105 పరుగులు, టీ20ల్లో 66 పరుగులు చేశాడు.

ఈ వేలంలో కేకేఆర్ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్‌ను రికార్డు స్థాయిలో రూ. 25.20 కోట్లకు కొనుగోలు చేసింది. గ్రీన్‌తో పాటు మతీశ పతిరన (రూ. 18 కోట్లు), ముస్తాఫిజుర్ రెహ్మాన్ (రూ. 9.20 కోట్లు) వంటి స్టార్ ఆటగాళ్లను కూడా జట్టులోకి తీసుకుంది. మొత్తం 13 మందిని కొనుగోలు చేసిన తర్వాత కేకేఆర్ వద్ద రూ. 45 లక్షల పర్సు మాత్రమే మిగిలింది.
Pappu Yadav
Sarthak Ranjan
KKR
Kolkata Knight Riders
IPL 2026
Indian Premier League
Cricket
Cameron Green
Delhi Cricket

More Telugu News