Maoist Party: 16 మంది మావోల అరెస్ట్‌... మావోయిస్టు పార్టీ కీలక లేఖ

Maoist Party Condemns Arrests in Sirpur Telangana
  • ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్‌లో 16 మంది అరెస్ట్‌
  • అరెస్టులకు ఖండించిన మావోయిస్టు పార్టీ
  • అధికార ప్రతినిధి జగన్ పేరుతో మావోయిస్టుల లేఖ
ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్‌లో 16 మంది మావోయిస్టులను అరెస్ట్ చేయడంపై మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా స్పందించింది. ఈ అరెస్టులను ఖండిస్తూ కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఓ లేఖను విడుదల చేసింది. కకర్ బుడ్డి, బాబ్జీ పేట్ గ్రామాల సమీపంలో నిరాయుధంగా ఉన్న తమ వారిని అరెస్ట్ చేశారని లేఖలో ఆరోపించింది. ఈ చర్య తెలంగాణలో కొనసాగుతున్న ప్రజాస్వామ్య వాతావరణానికి ఎదురుదెబ్బ అని పేర్కొంది.

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. ఫాసిస్టు బీజేపీ రూపొందించిన 'కగార్' యుద్ధానికి మద్దతు ఇవ్వొద్దని ఈ లేఖ ద్వారా మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి చేసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 'మావోయిస్టు ముక్త్', 'ప్రతిపక్ష ముక్త్' లక్ష్యాలతో ఈ యుద్ధాన్ని అమలు చేస్తోందని విమర్శించింది. 'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్, ఏక్ చునావ్, ఏక్ పార్టీ' వంటి నినాదాలతో దేశంలోని ఇతర పార్టీలను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించింది.

ఎన్నికల కమిషన్, కోర్టులు, సీబీఐ, ఎన్ఐఏ వంటి రాజ్యాంగ సంస్థలను కేంద్రం తన ఆధీనంలో పెట్టుకుని పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, దీనికి బీహార్ ఎన్నికలే తాజా ఉదాహరణ అని లేఖలో పేర్కొంది. బీజేపీ విధానాలు కేవలం కార్పొరేట్లకు మాత్రమే మేలు చేస్తున్నాయని విమర్శించింది. తెలంగాణలో ప్రశాంత వాతావరణం కొనసాగేలా చూసేందుకు ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ఆందోళనలు చేపట్టాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది.
Maoist Party
Telangana
Naxalites
Sirpur
Arrests
Congress
BJP
Kagar war
Political conspiracy
Jagan

More Telugu News