Shilpa Shetty: ఆ ఆరోపణల్లో నిజం లేదు: శిల్పా శెట్టి

Shilpa Shetty Denies Allegations in Cheating Case
  • తమపై సెక్షన్ 420 ప్రయోగించారన్న వార్తలను ఖండించిన శిల్పాశెట్టి
  • రూ. 60 కోట్ల మోసం కేసులో ఇన్‌స్టాగ్రామ్‌లో వివరణ ఇచ్చిన నటి
  • ఆరోపణలు నిరాధారమైనవి, దురుద్దేశపూర్వకమైనవి అని వెల్లడి
  • ఇప్పటికే హైకోర్టులో క్వాషింగ్ పిటిషన్ దాఖలు చేశామని స్పష్టీకరణ
  • ఇది వ్యాపార వైఫల్యానికి సంబంధించిన సివిల్ వివాదమంటున్న జంట
తనపై, తన భర్త రాజ్ కుంద్రాపై నమోదైన చీటింగ్ కేసులో ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) తాజాగా సెక్షన్ 420 (మోసం) ప్రయోగించిందంటూ వస్తున్న వార్తలను బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ఖండించారు. ఈ ఆరోపణలు నిరాధారమైనవి, దురుద్దేశపూర్వకమైనవి అని ఆమె కొట్టిపారేశారు. బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఈ మేరకు ఓ సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు.

"మాపై వస్తున్న నిరాధారమైన, దురుద్దేశపూర్వక ఆరోపణలను మేం ఖండిస్తున్నాం. ఎలాంటి చట్టపరమైన ఆధారం లేకుండా ఈ వివాదానికి క్రిమినల్ రంగు పులుముతున్నారు... మాపై సెక్షన్ 420 నమోదు చేశారన్న వార్తల్లో నిజం లేదు" అని శిల్పా తన పోస్టులో పేర్కొన్నారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఇప్పటికే హైకోర్టులో క్వాషింగ్ పిటిషన్ దాఖలు చేశామని, అది ఇంకా విచారణ దశలో ఉందని తెలిపారు. దర్యాప్తునకు తాము పూర్తిగా సహకరిస్తున్నామని, తమకు న్యాయవ్యవస్థపై, చట్టంపై పూర్తి నమ్మకం ఉందని ఆమె అన్నారు. ఈ విషయం కోర్టు పరిధిలో ఉన్నందున మీడియా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.

ముంబైకి చెందిన వ్యాపారవేత్త దీపక్ కొఠారీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబై ఈవోడబ్ల్యూ శిల్పా దంపతులపై రూ. 60 కోట్ల మోసం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 2015 నుంచి 2023 మధ్య కాలంలో శిల్పా దంపతులకు చెందిన బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో తాను సుమారు రూ. 60 కోట్లు పెట్టుబడిగా పెట్టానని, కానీ ఆ నిధులను పక్కదారి పట్టించి, తిరిగి చెల్లించలేదని కొఠారీ తన ఫిర్యాదులో ఆరోపించారు.

అయితే, ఇది వ్యాపార వైఫల్యానికి సంబంధించిన సివిల్ వివాదమని, ఇందులో ఎలాంటి క్రిమినల్ ఉద్దేశం లేదని శిల్పా దంపతులు గతంలోనే తెలిపారు. తాజాగా ఈ కేసులో సెక్షన్ 420 చేర్చారని మీడియాలో కథనాలు రావడంతో, దీనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)ను ఆశ్రయించేందుకు ఫిర్యాదుదారు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Shilpa Shetty
Raj Kundra
Mumbai Police
EOW
cheating case
Best Deal TV Private Limited
Deepak Kothari
section 420
High Court
Quashing Petition

More Telugu News