బంగ్లాదేశ్ నాయకుడి వ్యాఖ్యలు.. బంగ్లా హైకమిషనర్‌కు భారత్ సమన్లు

  • భారత దౌత్య కార్యాలయానికి ఇటీవల బెదిరింపులు
  • 'సెవెన్ సిస్టర్స్‌'ను ఒంటరి చేస్తామని బంగ్లా నాయకుడి వ్యాఖ్యలు
  • ఢిల్లీలోని హైకమిషనర్ రిజాజ్ హమీదుల్లాకు సమన్లు జారీ చేసిన భారత్
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని భారత దౌత్య కార్యాలయానికి ఇటీవల బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో, ఆ దేశ హైకమిషనర్ రిజాజ్ హమీదుల్లాకు భారత్ సమన్లు జారీ చేసింది. ఎలాంటి బెదిరింపులు వచ్చాయనే విషయాన్ని మాత్రం ప్రత్యేకంగా వెల్లడించలేదు. అయితే, ఈశాన్య రాష్ట్రాలను ప్రస్తావిస్తూ, 'సెవెన్ సిస్టర్స్‌'ను ఒంటరిని చేస్తామని బంగ్లాదేశ్ నాయకుడు హస్నత్ అబ్దుల్లా ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు భారత్‌కు వ్యతిరేకంగా ఉన్నాయి.

బంగ్లాదేశ్‌ను అస్థిరపరిస్తే 'సెవెన్ సిస్టర్స్‌'ను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ క్రమంలోనే తాజా సమన్లు జారీ అయినట్లు తెలుస్తోంది. గత సంవత్సరం షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పాలన పతనం తర్వాత భారత్ తో బంగ్లాదేశ్‌కు సంబంధాలు దెబ్బతిన్నాయి.

షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి ఢిల్లీలో గుర్తు తెలియని ప్రాంతంలో తలదాచుకుంటున్నారని సమాచారం. నాటి నుంచి భారత్‌కు వ్యతిరేకంగా అక్కడి నాయకులు పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. భారత్ వీటిని ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది.


More Telugu News