Chandrababu Naidu: అదే మన టార్గెట్... కలెక్టర్లకు రోడ్ మ్యాప్ ఇచ్చిన చంద్రబాబు

Chandrababu Naidu Outlines Roadmap for Collectors Targetting AP Growth
  • రాష్ట్రానికి 17.11 శాతం వృద్ధి లక్ష్యంగా నిర్దేశించిన సీఎం చంద్రబాబు
  • గత ప్రభుత్వ విధానాలతో ఏపీ దక్షిణాదిలో చివరి స్థానానికి చేరిందని ఆవేదన
  • వ్యవసాయం, ఉద్యాన రంగాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అధికారులకు సూచన
  • 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యమన్న ముఖ్యమంత్రి
  • పెట్టుబడుల ఒప్పందాలను కార్యరూపంలోకి తెచ్చేలా పనిచేయాలన్న మంత్రి లోకేశ్
ఆంధ్రప్రదేశ్‌ను తిరిగి ప్రగతి పథంలో నడిపి, దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలపాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. బుధవారం నాడు సచివాలయంలో ఆయన అధ్యక్షతన 5వ జిల్లా కలెక్టర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వివిధ శాఖల పనితీరుపై లోతైన సమీక్ష నిర్వహించిన సీఎం, రాష్ట్ర భవిష్యత్ ప్రగతికి సంబంధించిన స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను అధికారుల ముందుంచారు. గడచిన రెండు త్రైమాసికాల్లో మెరుగైన ఫలితాలు సాధించామని, ఈసారి 17.11 శాతం వృద్ధి లక్ష్యాన్ని చేరుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, "వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల్లో సాధించిన త్రైమాసిక ఫలితాల కోసం పరీక్షలు రాసిన విద్యార్థిలా ఎదురుచూస్తాను. అధికారులు కూడా అదే స్ఫూర్తితో పనిచేసి నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలి" అని అన్నారు. మొత్తం 17 కీలక రంగాల్లో (వర్టికల్స్) సమాన ప్రగతి సాధిస్తేనే రాష్ట్ర జీఎస్‌డీపీ పెరుగుతుందని, పశుసంపద, తయారీ రంగం, మత్స్య పరిశ్రమ వంటి అన్ని రంగాల్లో పురోగతి సాధించాలని సూచించారు.

గత ప్రభుత్వ హయాంలో అనుసరించిన తప్పుడు విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. "గతంలో మనం తెలంగాణతో పోటాపోటీగా ఉండేవాళ్లం. కానీ, గత ప్రభుత్వ చర్యల వల్ల దక్షిణాది రాష్ట్రాల్లోనే ఏపీ చివరి స్థానానికి పడిపోయింది. ఈ పరిస్థితిని మార్చి, తిరిగి గేరప్ చేసి అగ్రస్థానానికి చేరాలి," అని ఆయన అధికారులను ఉత్తేజపరిచారు. 2024 తర్వాత జీఎస్‌డీపీలో కొంత మెరుగుదల కనిపిస్తోందని, దీనిని మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు.

రాష్ట్ర అభివృద్ధిలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి నొక్కిచెప్పారు. వ్యవసాయం ఎప్పుడూ డిమాండ్ ఆధారితంగా ఉండాలన్నారు. "వ్యవసాయ రంగంలో ఎంత చేసినా ఇంకా చేయాల్సింది మిగిలే ఉంటుంది. మార్కెటింగ్ ఇంటెలిజెన్స్‌ను బలోపేతం చేయాలి. మన ఉత్పత్తులను జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు పంపగలిగితేనే ఈ రంగం స్థిరత్వం సాధిస్తుంది" అని వివరించారు. 

ఉద్యాన రంగంలో ఏపీ ఇప్పటికే ప్రథమ స్థానంలో ఉందని, ఈ రంగంలోకి సుమారు రూ. 60-70 వేల కోట్ల ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించాల్సిన అవసరం ఉందని తెలిపారు. పంటల ప్రణాళికలో భాగంగా స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, డిమాండ్ ఆధారిత పంటలు, నీటి భద్రత, ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రిటెక్ వంటి పది సూత్రాలను అనుసంధానించాలని సూచించారు.

అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలను 'పూర్వోదయ' కింద అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామిగా నిలపడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ ప్రయాణంలో ఏ ఒక్కరు వెనుకబడ్డా లక్ష్యాలను చేరుకోవడం కష్టమవుతుందని హెచ్చరించారు. గేట్స్ ఫౌండేషన్, అగ్రివాచ్ లాంటి సంస్థల సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో పాల్గొన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ, విశాఖ భాగస్వామ్య సదస్సులో కుదిరిన ఒప్పందాలను కార్యరూపంలోకి తెచ్చేందుకు భూ కేటాయింపులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రులమంతా దీనిపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు.
Chandrababu Naidu
Andhra Pradesh
AP GSDP
District Collectors Meeting
Economic Growth
Agriculture Sector
Rayalaseema
Uttarandhra
Nara Lokesh
Development Plan

More Telugu News