పులివెందులలో జగన్‌కు ఎదురుదెబ్బ.. టీడీపీలో చేరిన అనుచరుడు

  • వందలాది కార్యకర్తలతో టీడీపీలో చేరిన చంద్రశేఖర్ రెడ్డి
  • బీటెక్ రవి సమక్షంలో పార్టీలో చేరిన వైసీపీ శ్రేణులు
  • ఆందోళనలో వైసీపీ నేతలు, కార్యకర్తలు
సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి వలసల బెడద కొనసాగుతోంది. తాజాగా ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జగన్‌ అనుచరుడు, వైసీపీ నేత చంద్రశేఖర్ రెడ్డి (దిల్ మాంగే) తన అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు.

పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లిలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. వందలాది మంది వైసీపీ కార్యకర్తలతో కలిసి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ముందు వేంపల్లి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డితో పాటు పలువురు స్థానిక టీడీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు జరుగుతున్నప్పటికీ, జగన్ రాజకీయ కంచుకోట అయిన పులివెందులలోనే కీలక నేతలు పార్టీ వీడటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిణామం స్థానికంగా వైసీపీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది.


More Telugu News