Delhi Air Pollution: అన్ని సంస్థల్లో 50 శాతం వర్క్‌ ఫ్రం హోం.. ఢిల్లీ ప్రభుత్వం కీలక ఆదేశాలు

Delhi Government Orders 50 Percent Work From Home Due to Pollution
  • ఢిల్లీలో తీవ్రస్థాయికి చేరిన వాయు కాలుష్యం
  • అన్ని కంపెనీలకు 50 శాతం వర్క్ ఫ్రమ్ హోమ్ ఆదేశం
  • రాజధాని వ్యాప్తంగా గ్రాప్-4 ఆంక్షల అమలు
  • నిబంధనలు పాటించని వాహనాలకు పెట్రోల్ బంద్‌
  • నిర్మాణ కార్మికులకు రూ.10 వేల పరిహారం ప్రకటన
దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గ‌త కొన్ని రోజులుగా వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో నమోదవుతోంది. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ప్రభుత్వం కఠినమైన గ్రాప్-4 ఆంక్షలను కొనసాగిస్తోంది.

కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలన్నీ తప్పనిసరిగా 50 శాతం సిబ్బందితో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిబంధనను ఉల్లంఘించిన కంపెనీలపై జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది. 

గ్రాప్-4 ఆంక్షల కింద బీఎస్-6 ప్రమాణాల కంటే తక్కువ ఉన్న ఇతర రాష్ట్రాల వాహనాలు ఢిల్లీలోకి ప్రవేశించకుండా నిషేధం విధించారు. అలాగే పొల్యూషన్ అండర్ కంట్రోల్ (PUC) సర్టిఫికెట్ లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపరు. 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతులలో తరగతులు నిర్వహించాలని పాఠశాలలను ఆదేశించారు.

ఈ నెల‌ 15న ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ (AQI) 498కి చేరి అత్యంత ప్రమాదకర స్థాయికి పడిపోయింది. దట్టమైన పొగమంచు కారణంగా రహదారులు కనిపించక అనేక ప్రమాదాలు జరిగాయి. విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రస్తుత ఆంక్షల వల్ల ఉపాధి కోల్పోయిన నమోదిత నిర్మాణ కార్మికులకు రూ.10,000 పరిహారం అందిస్తామని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.

ఈ సంక్షోభంపై స్పందించిన ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా.. 9-10 నెలల్లో ఏ ప్రభుత్వమూ కాలుష్యాన్ని పూర్తిగా నిర్మూలించలేదని వ్యాఖ్యానించారు.
Delhi Air Pollution
Delhi Government
Work from home
Delhi AQI
Pollution control
Manjinder Singh Sirsa
Delhi Environment

More Telugu News